ప్రేమలో పడం...ఇదేం ప్రతిజ్ఞ!

February 15, 2020
img

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పార్కులలో ప్రేమికులు కనబడితే బజారంగ్ దళ్ కార్యకర్తలు వారికి బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం విన్నాం కానీ "మేము ప్రేమలో పడం... ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోం... తల్లితండ్రులు చూసినవారినే పెళ్ళి చేసుకొంటాం.." అంటూ మహిళా విద్యార్దుల చేత కళాశాల ప్రిన్సిపల్ ప్రతిజ్ఞ చేయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.  

శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని చుండూర్‌ పట్టణంలోగల మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో ఇది జరిగింది. ఇంకో విశేషమేమిటంటే ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి యశోమతి ఠాకూర్ సూచన మేరకు కళాశాలలో విద్యార్ధినుల చేత ఈ ప్రమాణం చేయించారు. 

విద్యార్ధినులు ప్రేమ పేరుతో వ్యామోహానికి లోనయి మోసపోయి జీవితాలు పాడుచేసుకోకూడదని, ప్రేమ పేరుతో వేధింపులు, అత్యాచారాలకు గురికాకూడదనే ఉద్దేశ్యంతోనే ఈవిధంగా ప్రమాణం చేయించామని యశోమతి ఠాకూర్‌ తెలిపారు. 

ఇది సదుదేశ్యంతో చేస్తున్నదే అయినా వయసులో ఉన్న ఆడపిల్లలను ‘ప్రేమలో పడం...’ అని ప్రతిజ్ఞ చేయించినంత మాత్రన్న ప్రేమలో పడకుండా ఉంటారా? 

మొబైల్ ఫోన్స్…వాటిలో అపరిమిత డాటా...అదీ అయిపోతే పార్కులు, బస్టాండ్లలో ఉచిత వైఫీ సౌకర్యం...మొబైల్ ఫోన్స్ లో అశ్లీల చిత్రాలు, సోషల్ మీడియా, అపరిచితులతో ఫేస్‌బుక్‌ స్నేహాలు.. బాయ్ ఫ్రెండ్.. గర్ల్ ఫ్రెండ్ కలిగి ఉండటం... వారితో శృంగారం చేయడం చాలా గొప్ప విషయం అన్నట్లు చెప్పే మన సినిమాలు...వంటివెన్నో విద్యార్దులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నాయని చెప్పవచ్చు. వాటి కారణంగానే...ఈ రోజుల్లో 7వ తరగతి నుంచే పిల్లల మద్య ప్రేమలు మొదలైపోతున్నాయి. ఇక డిగ్రీకొచ్చేసరికి ‘జీవితసారం’ చూసేసినవారు...మోసపోయి ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేసే యువతులు కోకొల్లలు. అయినా అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పుడు...ఎలా పుడుతుందో తెలియదు కనుక దానిని ఆపాలనుకోవడం కంటే... జీవితాలను పెడమార్గం పట్టిస్తున్న ఈ మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా..అవాంచిత స్నేహాలు వాటి పర్యవసనాల గురించి పిల్లలకు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు కూడా వివరిస్తే కొంత ప్రయోజనం ఉంటుందేమో?

Related Post