మహబూబాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు

February 12, 2020
img

మహబూబాబాద్‌ జిల్లా బాబూనాయక్ తండాలో గత రెండు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో అసైన్డ్ భూములలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కాళీ చేయాలని రెవెన్యూ అధికారులు హెచ్చరించినప్పటికీ ఎవరూ ఖాళీ చేయకపోవడంతో బుదవారం ఉదయం రెవెన్యూ సిబ్బంది జేసీబీ యంత్రంతో అక్కడకు చేరుకొని ఇళ్ళను కూల్చివేయడం మొదలుపెట్టారు. దాంతో వాటిలో నివసిస్తున్నవారు రెవెన్యూ సిబ్బందిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తమ ఇళ్లకు మునిసిపాలిటీయే డోర్ నెంబర్లు కేటాయించిందని కానీ వాటినే ఇప్పుడు అక్రమకట్టడాలని చెప్పి కూల్చివేస్తోందని ఇదెక్కడి న్యాయం? అని స్థానికులు ప్రశ్నించారు. కానీ రెవెన్యూ సిబ్బంది ఇళ్ళు కూల్చివేస్తుండటంతో స్థానికులు వారిపై రాళ్ళతో దాడి చేశారు. అదే సమయానికి అక్కడకు చేరుకొన్న మున్సిపల్ కమీషనర్, తహశీల్దార్‌లను చుట్టుముట్టి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ దాడిలో కమీషనర్ కారు అద్దాలు పగిలిపోయాయీ. రెవెన్యూ సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇళ్ళు కూల్చివేత కొనసాగుతుండటంతో బాబూనాయక్ తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను అన్యాయంగా రోడ్డున పడేశారని బాధిత కుటుంబాల మహిళలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Related Post