త్వరలో హైదరాబాద్‌లో రోడ్ సేఫ్టీ వాలంటీర్లు

January 24, 2020
img

హైదరాబాద్‌ నగరంలో నానాటికీ జనాభా దానితోపాటు వాహనాలు.. ట్రాఫిక్... రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇది ఒక్క హైదరాబాద్‌ నగరం సమస్య మాత్రమే కాదు. దేశంలో అన్ని ప్రధాన పట్టణాలు, నగరాలలో ఇదే పరిస్థితి. కనుక రోడ్డు ప్రమాదాలలో గాయపడినవారికి తక్షణ సాయం అందించి సమీప ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థను, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనే సుప్రీంకోర్టు సూచనమేరకు కేంద్రప్రభుత్వం ‘రోడ్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. దాని సూచనల మేరకు దేశంలో అన్ని రాష్ట్రాలు మూడు నెలలకోసారి రోడ్డు ప్రమాదాల వివరాలు, వాటిని నివారించడానికి తీసుకొన్న చర్యల గురించి నివేదికను సమర్పించవలసి ఉంటుంది. 


కనుక ముందుగా హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసువిభాగం నగరంలో తరచూ ప్రమాదాలు జరిగే 52 ప్రాంతాలను గుర్తించింది. ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ‘బ్లాక్ స్పాట్స్’ గా గుర్తించారు. ఆ ప్రాంతాలలో కొందరు స్థానికులను ఎంపిక చేసి వారికి ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈఎంఆర్)లో ప్రధమచికిత్సకు అవసరమైన శిక్షణ ఇప్పిస్తున్నారు. రోడ్ వాలంటీర్లుగా పిలువబడే వారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకొని పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారమందించి, గాయపడినవారికి అవసరమైన ప్రధమ చికిత్స చేసి సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. పోలీస్ శాఖ వారికి గుర్తింపుకార్డులు కూడా అందజేస్తుంది కనుక వారు గాయపడినవారిని ఆసుపత్రికి తీసుకువస్తే నిరాకరించకుండా తప్పనిసరిగా చికిత్స అందించవలసి ఉంటుంది. గాయపడినవారికి ప్రాణాపాయం ఉన్నట్లయితే వెంటనే అవసరమైన వైద్యం అందించవలసి ఉంటుంది తప్ప నిబందనల పేరు చెప్పి తప్పించుకోవడానికి వీలులేదు. 

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీస్ విభాగం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైతే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు దీనిని విస్తరిస్తారు. శిక్షణ పూర్తి చేసుకొన్న రోడ్ సేఫ్టీ వాలంటీర్లు త్వరలోనే హైదరాబాద్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. 

హైదరాబాద్‌లో బ్లాక్ స్పాట్స్:   

సికింద్రాబాద్ స్టేషన్ రోడ్, వైఎంసీఏ జంక్షన్, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్, బోయిన్ క్రాస్ రోడ్స్, తాడ్ క్రాస్ రోడ్స్, మదీనా క్రాస్ రోడ్స్, ధోబీఘాట్ క్రాస్ రోడ్స్, అశోక్ క్రాస్ ఆర్ క్రాస్ రోడ్స్, దిల్ బస్ చాదర్ క్రాస్ రోడ్స్, చాదర్ ఘాట్ క్రాస్ రోడ్స్, పుత్లీబౌలీ క్రాస్ రోడ్స్, ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్స్, చంపాపేట్ క్రాస్ రోడ్స్, విద్యానగర్ క్రాస్ రోడ్స్,

ఓల్డ్ ఆనంద్ థియేటర్-బేగంపేట్ జంక్షన్, ఐఎస్ సదన్ జంక్షన్, డీఎంఆర్ క్రాస్ ఫిసల్ టీ జంక్షన్, మోర్ సూపర్ కృష్ణాజంక్షన్, అడ్డా జంక్షన్, ఆంధ్రాబ్యాంక్ జంక్షన్-కోఠీ, అఫ్జల్ టీ జంక్షన్, మాసాబ్ ట్యాంక్‌ జంక్షన్, నిరంకారీభవన్ జంక్షన్-లక్డీకాపూల్, యూసుఫ్ బస్తీ జంక్షన్. 

సీజీఓ టవర్స్-కవాడిగూడ, సెంట్రల్ బస్ స్టేషన్ చాదర్ చమన్, పెద్దమ్మ టెంపుల్ జంక్షన్-జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ రోడ్ నెం-45-జూబ్లీహిల్స్, రోడ్ నెం-12 కమాన్-బంజారాహిల్స్, రేతీబౌలీ, బాపూఘాట్-లంగర్ రామ్ బారాదరి, లంగర్ దర్గా, సెవెన్ మెటర్నిటీ హాస్పిటల్-పెట్లబుర్జు, మారుతీనగర్ బండ్లగూడ(ఫలక్ దత్తునగర్-మిథానీటౌన్ ఓమర్ బహబూబ్ క్రాస్ చాంద్రాయణగుట్ట), ఫలక్ రైల్వేబ్రిడ్జీ, పురనాపూల్  షేక్ ఎంఆర్ ఆఫీస్, తాజ్ ఐలాండ్, ఎన్ ఎంజే మార్కెట్, దర్వాజా ప్రాంతాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతాలలో ఎంపిక చేసిన స్థానికులకు రోడ్ సేఫ్టీ వాలంటీర్లుగా శిక్షణ పొందుతున్నారు.

Related Post