ఆదివారం నుంచి షిరిడీసాయి ఆలయం నిరవదికంగా మూసివేత!

January 18, 2020
img

షిరిడీసాయి భక్తులకు ఓ దుర్వార్త. రేపు అంటే ఆదివారం నుంచి షిరిడీసాయి ఆలయాన్ని నిరవదికంగా మూసివేయబోతున్నట్లు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు భావూసాహెబ్ ప్రకటించారు. రాష్ట్రంలోని పర్భణీ జిల్లాలోగల ‘పత్రి’ అనే గ్రామంలో షిరిడీసాయి జన్మించారని ప్రజలు నమ్ముతుంటారు. కనుక షిరిడీలోని సాయి ఆలయానికి ధీటుగా అక్కడ కూడా ఓ ఆలయాన్ని నిర్మించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. 

దానిపై షిరిడీ సాయి సంస్థాన్ అభ్యంతరం, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. దశాబ్ధాలుగా షిరిడీసాయి ఆలయమే ప్రధాన ఆలయంగా భక్తుల పూజలు అందుకొంటున్నప్పుడు, ప్రభుత్వం కొత్తగా ఈ ప్రతిపాదన చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మరో ప్రధాన ఆలయం నిర్మించి దేశవిదేశాల నుంచి షిరిడీ వచ్చే భక్తులలో గందరగోళం సృష్టించడం సరికాదని వాదిస్తున్నారు. 

శనివారం ఉదయం షిరిడీ సంస్థాన్ సభ్యులు షిరిడీ గ్రామప్రజలతో సమావేశం కానున్నారు. దానిలో ఈ అంశంపై చర్చించి తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆదివారం నుంచి షిరిడీసాయి ఆలయాన్ని నిరవదికంగా మూసివేయబోతున్నట్లు షిరిడీ సంస్థాన్ ట్రస్ట్ సభ్యుడు భావూసాహెబ్ ప్రకటించారు.

Related Post