సంక్రాంతి హడావుడి షురూ...టోల్‌గేట్స్ జామ్‌

January 11, 2020
img

రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా సంక్రాంతి పండుగ హడావుడి ఎక్కడ మొదలవుతుందో తెలుసా? కోనసీమలోనో... కరీంనగర్‌లోనో కాదు హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో పనిచేస్తున్న లక్షాలది ఉద్యోగులు మూడు నాలుగు నెలల ముందు నుంచే శలవు మంజూరు చేయించుకొని ట్రెయిన్స్, బస్సులలో సొంత ఊళ్ళకు టికెట్స్ రిజర్వేషన్లు చేయించుకోవడంతో ఆ హడావుడి మొదలవుతుంది. ఆ తరువాత మెల్లగా సంక్రాంతి షాపింగ్ మొదలవుతుంది. అప్పటి నుంచి పండుగ కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ గడిపే ఉద్యోగులు, పండుగకు నాలుగైదు రోజుల ముందుగానే ఊళ్ళకు బయలుదేరడం మొదలుపెడతారు. దాంతో హైదరాబాద్‌ నగరం మెల్లగా ఖాళీ అవుతుంటుంది. దాంతో ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్‌ నగరంలోని రోడ్లు పిల్లలకు క్రికెట్ మైదానాలుగా మారిపోతుంటాయి.  

రైళ్ళు, బస్సులలో టికెట్స్ లభించనివారు, సొంత వాహనాలున్నవారు వాటిలోనే బయలుదేరిపోతుంటారు. దాంతో టోల్‌గేట్స్ వద్ద ట్రాఫిక్ జామ్‌ అయిపోతుంటుంది. ఆ సమస్యను అధిగమించడానికి ఈసారి కేంద్రప్రభుత్వం ఫాస్ట్-ట్యాగ్స్ విధానాన్ని అమలుచేస్తోంది. కానీ దానిపట్ల అవగాహన లేని కారణంగా నేటికీ చాలామంది వాహనదారులు ఫాస్ట్-ట్యాగ్స్ తీసుకోకుండా వచ్చి టోల్‌గేట్స్ వాడ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతున్నారు. 

ఐ‌టి ఉద్యోగులకు ఈసారి శని,ఆదివారాలు వారాంతపు శలవులు కలిసిరావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే వాహనాలలో సొంతూళ్ళకు బయలుదేరిపోతున్నారు. దాంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పతంగి టోల్‌గేట్‌ వద్ద శనివారం ఉదయం నుంచి బారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో ఏకంగా 8 లేన్లను ఫాస్ట్-ట్యాగ్ వాహనాల కోసం కేటాయించినపటికీ, స్కానర్లు పనిచేయకపోవడంతో మళ్ళీ పాత పద్దతిలోనే నగదు తీసుకొని వాహనాలను పంపిస్తుండటంతో అక్కడా బారీగా ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. కీసర టోల్‌గేట్‌ వద్ద ఫాస్ట్-ట్యాగ్ స్కానర్లు సరిగ్గానే పనిచేస్తుండటంతో వాహనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు గల టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఆ కారణంగా జాతీయ రహదారిపై అక్కడక్కడ ట్రాఫిక్ జామ్‌ అవుతోంది. 

రేపటి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ శలవులు మొదలవుతాయి కనుక హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో సొంతూళ్ళకు బయలుదేరుతారు. కనుక రేపటి నుంచి రైళ్ళు, బస్సులలో మరింత రద్దీ పెరుగవచ్చు. టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరుగవచ్చు. మళ్ళీ జనవరి 17న ముక్కనుమ పండుగ ముగియగానే తిరుగు ప్రయాణాలు ప్రారంభం అవుతాయి కనుక జనవరి 20 వరకు రద్దీ కొనసాగవచ్చు.

Related Post