దిశ కేసుపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

December 13, 2019
img

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ చేయబడిన నలుగురు నిందితుల మృతదేహాలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మార్చురీలో భద్రపరచాలని, అంతవరకు మృతదేహాల అప్పగింతపై ఎటువంటి విచారణ జరుపవద్దని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది.

నిందితుల మృతదేహాలను అప్పగించాలంటూ వారి కుటుంబ సభ్యులు తరపున హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది కనుక మృతదేహాలను అప్పగింతకు ఉత్తర్వులు ఇవ్వలేమని, కనుక సుప్రీంకోర్టు ఆశ్రయించవలసిందిగా ఆదేశించింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఈ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడంతో సుప్రీంకోర్టు గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

నిజానికి ఎన్‌కౌంటర్‌ జరిగిన తరువాత నిబందనల ప్రకారం మృతదేహాలకు పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహింపజేసి ఆదే రోజున సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించాలనుకొన్నారు. కానీ హైకోర్టు కలుగజేసుకొని విచారణ పూర్తయ్యేవరకు వారి మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కలుగజేసుకొని వారి మృతదేహాలను మరికొంతకాలం మార్చూరీలోనే ఉంచాలని ఆదేశించడంతో, ఈ కేసులు, విచారణలు ఇంకా ఎప్పటికీ ముగుస్తాయో వారి మృతదేహాలకు మార్చూరీ నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. 

దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విఎస్ సిర్పుకర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దానిలో బాంబే హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ రేఖా, సిబిఐ రిటైర్డ్ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. వారు ఆరు నెలలోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Related Post