మానవత్వం మంటగలిసిన చోటే...

December 11, 2019
img

దిశ అత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌తో షాద్‌నగర్‌ బైపాస్‌ జాతీయ రహదారిపై ఉన్న చటాన్‌పల్లి బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించేవారు ఇప్పుడు అక్కడ ఆగి మానవత్వం మంటగలిసిన ఆ ప్రదేశాన్ని కాసేపు చూసి ముందుకు సాగుతున్నారు. సరిగ్గా అక్కడే మాతృత్వం ఎంత గొప్పదో చాటి చెప్పిన ఘటన ఒకటి జరిగింది. 

మంగళవారం ఉదయం ఒక షేరింగ్ వాహనంలో కొంతమంది చటాన్‌పల్లి బ్రిడ్జి మీదుగా వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన ఒక లారీ దానిని గుద్దింది. లారీ డ్రైవరు చటాన్‌పల్లి బ్రిడ్జి క్రింద దిశ ఘటన జరిగిన ప్రదేశాన్ని చూస్తూ లారీని ముందుకు నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షేరింగ్ వాహనంలో ఉన్న ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొత్తకోటకు చెందిన శాంతి అనే మహిళ కూడా ఉంది. అటుగా వెళుతున్న కొందరు స్థానికులు వెంటనే వారినందరినీ వాహనంలో నుంచి క్రిందకు దింపి పోలీసులకు, 108 అంబులెన్స్ కు ఫోన్లు చేశారు. 

ప్రమాదం జరిగినప్పుడు శాంతి ఒడిలో వెచ్చగా నిద్రిస్తున్న 8 నెలల పసిపాప కూడా ఉంది కానీ తల్లి ఒడిలో ఉండటంతో పాపకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ వాహనాన్ని లారీ గుద్దినప్పుడు పెద్ద శబ్ధం అవడంతో ఆ పాప ఉలిక్కిపడి బిగ్గరగా ఏడవసాగింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలై స్పృహ తప్పిన ఆ పాప తల్లి శాంతి పాప ఏడుపుతో స్పృహలోకి వచ్చింది. వెంటనే లేచి పాపను అక్కున చేర్చుకొని రోడ్డుపక్కనే పడుకొని పాపకు పాలిచ్చింది. దాంతో పాప ప్రశాంతంగా నిద్రపోయింది. మానవత్వం మంటగలిసిన చోటే మాతృత్వం వెల్లివిరియడం విశేషమే కదా?

Related Post