బయోడైవర్సిటీ కేసు...తాజా అప్‌డేట్స్

December 07, 2019
img

గత నెల 23న హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై అతివేగంతో దూసుకుపోయిన కారు అదుపుతప్పి క్రింద పడటంతో కారు క్రింద నలిగి సత్యవతి (56) అనే మహిళ చనిపోగా, మరో ముగ్గురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారకుడైన కారు యజమాని కల్వకుంట్ల కృష్ణ మిలన్‌రావు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకోవడంతో మొన్న ఆదివారం రాత్రి డిశ్చార్ అయ్యారు. 

పోలీసులు ఆయనపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్దపడగా ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 12వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ ప్రమాదంలో నా తప్పు ఏమీ లేదు. ఆ సమయంలో నేను నిర్దేశిత వేగంతోనే కారు నడుపుతున్నాను. కానీ బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ మలుపు ‘ఎస్’ ఆకారంలో ఉండటంతో నేను గందరగోళానికి గురయ్యాను. దాంతో నా కారు అదుపు తప్పింది. కనుక బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ డిజైన్‌లో లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది తప్ప దీనిలో నా తప్పు ఏమీ లేదు. నాకు మరికొన్ని రోజులు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. కానీ పోలీసులు కేసు పేరుతో నన్ను వేధిస్తున్నారు,” అని అన్నారు. 

ఈ కేసుపై హైదరాబాద్‌ పోలీసులు స్పందిస్తూ, “బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై గంటకు 40కిమీ వేగంతో ప్రయాణించాలని హెచ్చరిస్తూ ఎక్కడికక్కడ బోర్డులు పెట్టినప్పటికీ కృష్ణ మిలన్‌రావు గంటకు 105.8 కిమీ వేగంతో ప్రయాణించినట్లు మావద్ద సిసి ఫుటేజీ ఆధారాలున్నాయి. అతివేగం కారణంగానే వాహనం అదుపు తప్పి క్రిందపడింది. కనుక ఈ కేసుపై డిసెంబర్ 12న హైకోర్టులో ఆ సాక్ష్యాధారాలతో కౌంటర్ వేస్తాము,” అని తెలిపారు.

Related Post