డిల్లీలో ఘోర అగ్నిప్రమాదం: 43 మంది మృతి

December 09, 2019
img

దేశరాజధాని డిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 43 మంది చనిపోగా మరో 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తర డిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్ మండీలో గల ఒక 4 అంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారుజామున ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు, టోపీలు,ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తుంటారు. ఆ వర్క్ షాపులలో పనిచేసే కార్మికులు అదే భవనంలో పై అంతస్తులో నివశిస్తుంటారు. 

మొదట రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ నిండా ప్లాస్టిక్ వస్తువులే నిండి ఉండటంతో క్షణాలలో మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. దాంతో గాడనిద్రలో ఉన్న కార్మికులకు ఏమి జరుగుతోందో తెలుసుకొనేలోపుగానే మంటలలో చిక్కుకొని చనిపోయారు. వారిలో చాలామంది మంటలలో దగ్దమైన ప్లాస్టిక్ వస్తువుల నుంచి వెలువడిన ప్రమాదకరమైన విషవాయువుల కారణంగా ఉక్కిరిబిక్కిరయ్యి చనిపోయారు. 

ప్రమాదం జరిగిన ప్రదేశం ఇరుకు గల్లీల మద్యన ఉండటంతో సమాచారం అందుకొన్న అగ్నిమాపక దళాలు అక్కడకు చేరుకోవడం చాలా కష్టమైంది. అతికష్టం మీద వారు అక్కడకు చేరుకొని ఒకపక్క మంటలను అదుపు చేస్తూ భవనంలో చిక్కుకొన్న 63 మంది కార్మికులను కాపాడారు. కార్మికులందరూ యూపీ, బిహార్ రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే. వారిలో అత్యధికులు 14-18 ఏళ్ళ లోపు మైనర్లే కావడం విశేషం. 

పోలీసులు భవన యజమానిపై, మైనర్ల చేత పని చేయిస్తున్న సదరు వర్క్ షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్ర దిగ్బ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. 

ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ప్రధాని నరేంద్రమోడీ నష్టపరిహారం ప్రకటించారు. డిల్లీ ప్రభుత్వం తరపున చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.1,00,000తో పాటు వారి చికిత్సకయ్యే ఖర్చులను కూడా భరిస్తామని డిల్లీ సిఎంఅరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 

Related Post