ఆశిష్ గౌడ్‌పై ఎందుకు చర్యలు తీసుకోరు? సంజన

December 05, 2019
img

పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు ఆశిష్‌ గౌడ్‌ తనతో పబ్‌లో అసభ్యంగా వ్యవహరించినట్లు బిగ్‌బాస్-2 కంటెస్టెంట్ అన్నె సంజన మాధాపూర్ పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు పోలీసులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆమె బుదవారం ఉదయం మళ్ళీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులను నిలదీశారు. దిశ ఘటనపై ఎంతో హడావుడి చేస్తున్న పోలీసులు తన ఫిర్యాదుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “వృత్తి రీత్యా నేను షూటింగుల కోసం అర్ధరాత్రి కూడా బయట తిరగవలసి వస్తుంటుంది. శనివారం రాత్రి నా షూటింగ్ పనులు ముగించుకొని కాసేపు రిలాక్స్ అవడానికి నోవాటెల్ హోటల్‌లోని ఆరిస్ట్రీ పబ్‌కు వెళ్ళాను. అక్కడే ఉన్న ఆశిష్ గౌడ్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బూతులు తిట్టాడు. వెంటనే నేను అక్కడి నుంచి నేరుగా మాధాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి అతనిపై ఫిర్యాదు చేశాను. పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళేవరకు అతను ఎవరో కూడా నాకు తెలియదు. అతను మాజీ ఎమ్మెల్యే కొడుకని కనుక చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నట్లు వారి మాటలతో అర్ధం అయ్యింది. అతను మాజీ ఎమ్మెల్యే కొడుకైతే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించవచ్చా? అతనికి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉంది కనుక నేను ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు అతనిపై చర్యలు తీసుకోరా? పైగా కేసు నమోదు చేస్తే అతని భవిష్యత్‌ పాడవుతుందని నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం చాలా దారుణం. అతనిపై నేను బురద జల్లి అతని భవిష్యత్‌ పాడుచేస్తున్నానని చెప్పడం ఏమిటి? అసలు అతను ఎవరో కూడా నాకు తెలీనప్పుడు అతనిపై నేనెందుకు బురదజల్లుతాను? అయినా అతను తప్పు చేస్తే అతనిని పిలిచి ప్రశ్నించవలసిన పోలీసులు నాకు బుద్దులు చెప్పడం ఏమిటి? అర్దరాత్రి మహిళలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదని పాఠాలు చెపుతున్నవారు అలా చట్టం చేయించగలరా? ఒకవేళ ఆ రోజు నేనే తప్పు చేసినట్లు పోలీసులు సాక్ష్యాధారాలు చూపించగలిగితే బహిరంగంగా ఆశిష్ గౌడ్‌కు క్షమాపణలు చెప్పడానికి సిద్దంగా ఉన్నాను. 

ఒకపక్క మహిళల హక్కులు, భద్రతపై తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతుంటే హైదరాబాద్‌ నగరంలో నాకు న్యాయం లభించదా? ఇకనైనా పోలీసులు తక్షణం ఆశిష్ గౌడ్‌పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వస్తుంది.” అని సంజన అన్నారు.

Related Post