నల్గొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం

December 02, 2019
img

సోమవారం తెల్లవారుజామున నల్గొండలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటలలో పూర్తిగా దగ్దం అయ్యింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారు చూస్తుండగానే బస్సు క్షణాలలో మంటలలో కాలి బూడిదైపోయింది. 

ప్రయాణికులు తెలిపిన సమాచారం మేరకు, గుంటూరుకు చెందిన గాయత్రి ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై చర్లపల్లి వద్దకు చేరుకొన్నప్పుడు బస్సు ఇంజనులో నుంచి పొగలు వస్తుండటం గమనించి డ్రైవరు బస్సును నిలిపివేయడంతో అందరూ క్రిందకు దిగిపోయారు. నిమిషాల వ్యవధిలోనే బస్సు మంటలలో కాలి బూడిదైపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. 


సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొన్నారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రయాణికుల స్టేట్‌మెంట్స్ నమోదు చేసుకొని వేరే వాహనాలలో వారి గమ్యస్థానాలకు పంపించారు. 

తరచూ ఇటువంటి అగ్నిప్రమాదాలు జరుగుతున్నా వాటి నియంత్రణకు బస్సులలో నేటికీ అగ్నిమాపక సాధనాలు అమర్చడం లేదు. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఏవిధంగా బయటపడాలి?బస్సులో అగ్నిమాపక సాధనాలు ఎక్కడ అమర్చబడి ఉన్నాయి? వాటిని ఏవిధంగా ఉపయోగించాలి? అత్యవసర ద్వారాలు ఎక్కడున్నాయి? వాటిని ఏవిధంగా తెరవాలి?బస్సు డ్రైవరు, క్లీనరు పేర్లు ఏమిటి? వారు ఎన్ని గంటల నుంచి డ్యూటీ చేస్తున్నారు? వారు మద్యం త్రాగి ఉన్నారా లేదా? అంతకు ముందు బస్సు ఎన్ని గంటలు ప్రయాణించింది? తరువాత బస్సును పూర్తిగా తనికీలు చేసి ఎటువంటి లోపాలు లేవని నిర్ధారించుకొన్నారా?వంటి అంశాలపై బస్సు నిర్వాహకులు ప్రయాణానికి ముందు ప్రయాణికులకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేయడం లేదు. చాలాసార్లు బస్సులో ప్రయాణిస్తున్నవారి పూర్తి వివరాలు కూడా బస్సు నిర్వాహకుల వద్ద ఉండటం లేదు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులకు ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి మళ్ళీ ప్రత్యేకంగా దర్యాప్తు చేయవలసి వస్తోంది. రవాణాశాఖ నిర్లిప్తత లేదా అలసత్వం దీనికి కారణమని చెప్పక తప్పదు. ఇకనైనా ఇటువంటి ఏర్పాట్లు, ముందస్తు సమాచారం అందుబాటులోకి తెస్తే మంచిది.

Related Post