హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

November 20, 2019
img

హైదరాబాద్‌లో పొగాకు హరిణి (24) అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బుదవారం ఉదయం ఆత్మహత్య చేసుకొంది. ఆమె మాదాపూర్‌లో గల గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో రెండేళ్ళు కాంట్రాక్టుపై జూనియర్ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తోంది. వచ్చే నెలతో రెండేళ్ళ గడువు ముగియనుండటంతో మళ్ళీ మరో ఉద్యోగం దొరుకుతుందో లేదో అనే దిగులుతో ఈరోజు ఉదయం గచ్చిబౌలిలో తాను ఉంటున్న లేడీస్ హాస్టల్‌లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఆమె పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. సమాచారం అందుకొన్న రాచకొండ పోలీసులు అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని ఆమె శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆమె డిప్రెషన్‌కు గురయ్యి ఆత్మహత్య చేసుకొందా లేక ప్రేమ వైఫల్యం లేదా పనిచేస్తున్న ఆఫీసులో లేదా బయటా  వేధింపులు వంటి మరేదైనా కారణం వల్లనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఒకవేళ ఆమె నిరుద్యోగ భయంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటే అది చాలా తొందరపాటు నిర్ణయమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే, హైదరాబాద్‌ మహానగరంలో చాలా ఉద్యోగావకాశాలు ఉన్నందునే వివిద రాష్ట్రాల నుంచి యువత అక్కడకు చేరుకొని తమ అర్హత, అనుభవాలకు తగిన ఉద్యోగాలు సంపాదించుకొని జీవిస్తున్నారు. ఉన్నత కఃదువులు చదివినవారు కొంతమంది ఏదో ఓ ఉపాధిమార్గం ఎంచుకొని మరో నలుగురికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కనుక ఉన్న అవకాశాల కోసం చూడకుండా నిరుద్యోగభయంతో ఆత్మహత్య చేసుకోవడం తొందరపాటే. పైగా ఈ తొందరపాటు నిర్ణయం వలన ఆమె  తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిల్చింది.

Related Post