సికింద్రాబాద్‌ స్టేషన్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం

October 09, 2019
img

సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగి ఉండేది కానీ రైల్వే డ్రైవర్ చురుకుగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది. 

సోమవారం సాయంత్రం 3.50 గంటలకు హౌరా వెళ్లవలసిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు 1వ నెంబర్ ప్లాట్ ఫారం పైకి రావలసి ఉంది. సరిగ్గా అదే సమయంలో ఫలక్‌నుమా నుంచి ఎంఎంటిఎస్ రైలు 4వ నెంబరు ప్లాట్‌ఫారం మీదకు వచ్చినట్లు మైకులో ప్రకటించారు. అదివిన్న కొందరు ప్రయాణికులు తాము ఎదురుచూస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ 4వ నెంబరు ప్లాట్‌ఫారం మీదకు వచ్చిందని భావించి కంగారుగా ప్లాట్‌ఫారం మీద నుంచి పట్టాలపై దూకి పట్టాలు దాటుకొంటూ వెళ్ళసాగారు. కానీ అదే సమయంలో పక్క ప్లాట్‌ఫారం మీద ఉన్న కాగజ్‌నగర్‌ వెళ్ళవలసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ మెల్లగా కదులుతోంది. ఆ సమయంలో ఇంజను ముందు కనీసం 7-8 మంది ప్రయాణికులు పట్టాలపైనే ఉన్నారు. వారిని గమనించిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్ బండికి సడన్ బ్రేకులు వేసి నిలిపివేయడంత పెను ప్రమాదం తప్పిపోయింది. లేకుంటే వారందరూ రైలు క్రింద నలిగిపోయుండేవారే. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న వారందరూ బ్రతుకు జీవుడా అనుకొంటూ మళ్ళీ 1వ నెంబర్ ప్లాట్ ఫారంపైకి చేరుకున్నారు. 


Related Post