300 అడుగుల లోతులో రాయల్ వశిష్ట

September 17, 2019
img

గోదావరినదిపై పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు ఆదివారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు ప్రాంతంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది సురక్షితంగా బయటపడగా, మరో 38 మంది గల్లంతయ్యారు. గోదావరి నదిలో గాలిస్తున్న నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు కానీ వారి ఆచూకీ లభించడం లేదు. మిగిలినవారు మునిగిన బోటులో చిక్కుకొని బయటకురాలేక లోపలే మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. కనుక బోటు మునిగిన ప్రాంతంలో గాలించగా అది సుమారు 300 అడుగుల లోతున ఉన్నట్లు కనుగొన్నారు. ఇప్పుడు దానిని బయటకు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దీనికోసం గుజరాత్, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ నుంచి అత్యాధునిక పరికరాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొన్నాయి. వారు నీటి అడుగున ఉన్న బోటు ఏవిదంగా ఉందో కెమెరాల ద్వారా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నది గర్భంలో సుమారు 300 అడుగుల లోతున ఉన్న ఆ బోటును బయటకు తీస్తేగానీ దానిలో ఎంతమంది చిక్కుకుపోయారో తెలియదు. కనుక క్రేన్ల సాయంతో దానిని బయటకు తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Post