ఒక వ్యక్తి.. మూడు ప్రభుత్వోద్యోగాలు..30 ఏళ్ళు సర్వీస్!

August 24, 2019
img

ఒక్కోసారి ప్రతిభావంతులకు ఒకే సమయంలో రెండు మూడు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైనట్లు వార్తలలో చదివే ఉంటాము. కానీ ఒకే వ్యక్తి...మూడు ప్రభుత్వోద్యోగాలలో 30 ఏళ్ళ సర్వీస్ పూర్తి చేసినట్లు ఎప్పుడూ చదివి ఉండము. బిహార్ రాష్ట్రంలో అటువంటి ఘనుడు ఉన్నాడు. 

అతని పేరు సురేశ్ రామ్. పట్నాలోని బాబౌల్ గ్రామానికి చెందిన అతను 1988, ఫిబ్రవరి 20న బిహార్ రాష్ట్ర రోడ్ల నిర్మాణశాఖలో జూనియర్ ఇంజనీరుగా జేరాడు. 1989, జూలై 28న రాష్ట్ర జలవనరుల శాఖలో ఇంజనీరుగా అపాయింట్మెంట్ లభించడంతో దానిలో కూడా చేరిపోయాడు. ఆ రెండు ఉద్యోగాలు చేసుకొంటుండగానే, ఆరు నెలల తరువాత పొరుగునే ఉన్న సుపౌల్ జిల్లాలో భీమ్‌నగర్‌లో మరో ప్రభుత్వోద్యోగానికి ఎంపికయ్యాడు. విశేషమేమిటంటే అది కూడా రాష్ట్ర జలవనరుల శాఖలోనే! 

ఈవిధంగా ఒకేసారి మూడు ప్రభుత్వోద్యోగాలలో 30 ఏళ్ళు సర్వీసు పూర్తిచేయడమే కాకుండా మూడు ఉద్యోగాలలో క్రమం తప్పకుండా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అందుకొంటూ దర్జాగా బ్రతికేస్తున్నాడు. మరొక 5-6 నెలల వ్యవధిలో మూడు ఉద్యోగాల నుంచి పదవీ విరమణ కూడా చేయబోతున్నాడు. అంతా సవ్యంగా సాగిపోయుంటే, జీవితాంతం మూడు పెన్షన్లు అందుకొంటూ హాయిగా బ్రతికేసేవాడు. కానీ ఉద్యోగుల జీతభత్యాలు మదింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్”తో సురేశ్ రామ్ వ్యవహారం బయటపడింది. దానిలో భాగంగా ఉద్యోగులు అందరూ తమ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఉద్యోగానికి సంబందించిన పత్రాలు వగైరాలన్నీ సమర్పించాలని జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సమర్పిస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో సురేశ్ రామ్ కుంటిసాకులతో కాలక్షేపం చేయసాగాడు. 

అతని వ్యవహారం చూసి అనుమానం కలిగి పై అధికారులు విచారణ జరుపగా అసలు విషయం బయటపడింది. అప్పుడు వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దర్యాప్తులో మూడవ ఉద్యోగం వ్యవహారం కూడా బయటపడటంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. దాంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతనికోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పదవీ విరమణ చేసి దర్జాగా మూడు పెన్షన్లు అందుకోవలసిన సమయంలో శేషజీవితం జైలులో ఊచలు లెక్కించవలసిన పరిస్థితి ఏర్పడింది సురేశ్ రామ్‌కు.

Related Post