సచివాలయం తరలింపుపై ఓ సామాన్యుడి ఆవేదన

August 13, 2019
img

సచివాలయం తరలింపును, దాని కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. సిఎం కేసీఆర్‌ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కానీ దీనిపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడమే కాకుండా సచివాలయంలోని ప్రభుత్వ కార్యాలన్నిటినీ తాత్కాలిక సచివాలయం  బీఆర్‌కె భవన్‌లోకి 3 రోజులలోగా తరలించాలని గడువు విధించడంతో జోరుగా తరలింపు పనులు జరుగుతున్నాయి.

సచివాలయం కూల్చివేయాలనే నిర్ణయంపై ఆవేదన చెందుతున్నవారిలో ఒక సామాన్యుడు కూడా ఉన్నాడు. అతనే సచివాలయంలో గత 20 ఏళ్లుగా తోటమాలిగా పనిచేస్తున్న యేకుల వందన్. గత 20 ఏళ్లలో అతను సచివాలయంలో అనేక మొక్కలను నాటి వాటిని కన్నపిల్లల కంటే ప్రేమగా సంరక్షించుకొన్నాడు. ఆ కారణంగా సచివాలయం ప్రాంగణమంతా పచ్చటి చెట్లతో, వాటిపై గూళ్ళు కట్టుకొన్న అనేక పక్షుల కిలకిలారావాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కన్నబిడ్డలలా సాకిన ఆ పచ్చటిచెట్లన్నిటినీ త్వరలో నరికివేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి అతను ఆ చెట్ల మద్య దిగులుగా తిరుగుతున్నాడని అతని సహోద్యోగులు చెపుతున్నారు. ఆ చెట్లను కాపాడే శక్తి తనవంటి సామాన్యుడికి లేదని కానీ చివరి నిమిషం వరకు ఆ చెట్లకు సేవ చేస్తానని యేకుల వందన్ చెపుతున్నాడు. అతని ఆవేదన అరణ్యరోదనే అని అందరికీ తెలుసు. 

Related Post