సూరత్‌లో ఘోర అగ్నిప్రమాదం: 21 మంది విద్యార్దులు మృతి

May 25, 2019
img

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో నిన్న ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దానిలో 21 మంది విద్యార్దులు మృతి చెందారు. సూరత్‌లోని సర్తానా అనే ప్రాంతంలో గల తక్షశిల అనే వాణిజ్య సముదాయం ఉంది. ఆ భవనం 4వ అంతస్తులో ఒక కోచింగ్ సెంటరు ఉంది. దానిలో 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్దులు వివిద సబ్జెక్టులలో కోచింగ్ పొందుతుంటారు. నిన్న మధ్యాహ్నం విద్యార్దులు తరగతి గదిలో వారు పాఠాలు వింటున్నప్పుడు, అకస్మాత్తుగా రెండవ అంతస్తులో మంటలు అంటుకొన్నాయి. క్షణాలలో ఆ మంటలు, దట్టమైన పొగ 4వ అంతస్తుకు వ్యాపించడంతో బయటకు వెళ్ళే దారిలేక కొందరు విద్యార్దులు 5వ అంతస్తుకు చేరుకొన్నారు. మరికొందరు ఆ మంటలు, పొగలో చిక్కుకొని తరగతి గదిలోనే ఉండిపోయి సజీవ దహనం అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు తరగతి గదిలో 50 మందికి పైగా విద్యార్దులు ఉన్నందున మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. 

క్షణాలలో 5వ అంతస్తుకు కూడా మంటలు ఎగబ్రాకడంతో విద్యార్దులు తమ ప్రాణాలు కాపాడుకొనేందుకు అక్కడి నుంచి ఒకరొకరిగా క్రిందకు దూకేసారు. కానీ క్రిందన గుమిగూడిన ప్రజలు వారిని కాపాడేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా తమ మొబైల్ ఫోన్స్ లో వారు దూకడాన్ని చిత్రీకరిస్తుండటంతో క్రిందపడిన పిల్లలు తలలు పగిలి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయారు. కొందఋ విద్యార్దులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది విద్యార్దులు మృతి చెందారని సూరత్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ తెలిపారు.

Related Post