మోహిదీపట్నంలో అరుదైన రాబందు

May 21, 2019
img

ఒకప్పుడు రాష్ట్రంలో...దేశంలో వేల సంఖ్యలో రాబందులు కనిపించేవి. చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాలే వాటికి ఆహారం. మనుషులకు హానికలిగించే ఆ వ్యర్ధాలను అవి తినేసి పరోక్షంగాఎంతో సహాయపడేవి. కానీ వాటి ఆవాస ప్రాంతాలైన కొండలు, గుట్టలను మనుషులు ఆక్రమించేస్తూ, విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తుండటంతో వాటి మనుగడ కష్టం అయిపోయింది. పల్లెల్లో సైతం పశువుల పెంపకం తగ్గిపోయింది. పాలీయని పశువులను నిర్ధాక్షిణ్యంగా కబేళాలకు అమ్మేసుకొంటున్నారు. ఇటువంటి అనేక కారణాల చేత దేశంలో రాబందుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి ఇప్పుడు పదుల సంఖ్యకు చేరుకొంది. ఇటువంటి సమయంలో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మోహిదీపట్నం  సమీపంలో ఆసీఫ్ నగర్ వద్ద ఒక అరుదైన రాబందు పిల్ల కనబడింది. 

సుమారు రెండు దశాబ్ధాల క్రితం అటువంటి తెల్లటి ముక్కు కలిగిన రాబందును చూశామని స్థానికులు చెప్పారు. అసిఫ్ నగర్ రోడ్డు పక్కన వాలి ఉన్నప్పుడు వీధికుక్కలు దానిపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తుంటే, అక్కడే ఉన్న అబ్దుల్ నయీమ్ అనే వ్యక్తి అదొక అరుదైన రాబందు అని గుర్తించి దానిని కాపాడి ఆహారం నీరు అందించి, జూ అధికారులకు అప్పగించారు. అది పొరపాటున తల్లి సంరక్షణ నుంచి బయటకు వచ్చేయడంతో ఆకలిదప్పులతో అలమటిస్తూ చాలా నీరసంగా ఉంది. జూ అధికారులు దానికి అవసరమైన సంరక్షణ చేస్తున్నారు. 

అది ఇంకా చిన్న పిల్ల కనుక ఎక్కువ దూరం ఎగురలేదు. కనుక ఆసీఫ్ నగర్ పరిసరప్రాంతాలలోనే ఎక్కడో తల్లి పక్షితో సహా మరికొన్ని రాబందు పిల్లలు ఉండవచ్చని భావిస్తున్న అబ్దుల్ నయీమ్, తన స్నేహితులతో కలిసి వాటి కోసం వెతుకుతున్నారు. ఇటువంటి అరుదైన జాతి రాబందు నగరం నడిబొడ్డులో ప్రత్యక్షం అవడం వాటికి అనువైన ఆవాసం, ఆహారం ఎక్కడో లభిస్తోందని జూ అధికారులు భావిస్తున్నారు. 

Related Post