సలేశ్వరం లింగమయ్య జాతరకు వెళ్దామా?

April 18, 2019
img

నేటి నుంచి సలేశ్వరం లింగమయ్య స్వామి ఉత్సవాలు, జాతర మొదలయ్యాయి. నాగర్ కర్నూల్‌ జిల్లా పరిధిలో గల నల్లమల అడవుల మద్యలో వెలిసిన శ్రీ సలేశ్వరం లింగమయ్య స్వామిని కొలిచి మొక్కులు తీర్చుకొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. వారి సౌకర్యార్ధం టిఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రధాన డిపోల నుంచి  సలేశ్వరం వరకు బస్సులు నడిపిస్తుంది. నాలుగు రోజులపాటు సాగే ఈ జాతరకు ఇరుగుపొరుగు రాష్ట్రాలైన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఉగాది పండుగ తరువాత వచ్చే పౌర్ణమిరోజు నుంచి ఈ జాతర నిర్వహిస్తుంటారు. సలేశ్వరం లింగమయ్య స్వామి వారి ఆలయం ఏడాదిలో కేవలం ఈ 4 రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు కనుక ఈ నాలుగు రోజులు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. 



ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత, ట్రెక్కింగ్ కలగలిపితే సలేశ్వరం జాతర...     

సలేశ్వరం లింగమయ్య స్వామివారి ఆలయం దర్శనభాగ్యం లభించాలంటే పూర్తి ఆరోగ్యం, పట్టుదల, అంతకు మించి భక్తి ఉన్నవారికి మాత్రమే సాధ్యపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే దట్టమైన అడవులలో ఎగుడుదిగుడు మార్గంలో వాహనంలో సుమారు 20 కిమీ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అప్పటికే ఒళ్ళు హూనం అయిపోయుంటుంది. ఆ తరువాత సుమారు 5 కిమీ రాళ్ళు రప్పలు మీదుగా కాలినడకన నడుచుకొంటూ ముందుకు సాగి సలేశ్వరం లింగమయ్య స్వామి వెలిసిన కొండపైకి చేరుకోవలసి ఉంటుంది. ఈ పరీక్షలన్నీ తట్టుకొన్నవారికే స్వామివారి దర్శనభాగ్యం లభిస్తుంది. 


అయితే దట్టమైన అడవులు, వాటి మద్య గలగల పారే సెలయేర్లు, కొండపై నుంచి ప్రవహించే జలపాతాలు, పక్షులు కిలకిలారావాలు ప్రకృతి సోయగాలను చూస్తున్నప్పుడు శరీరం అలసినా...మనసు పరవశిస్తుంది. శ్రమపడి కొండపైకి చేరుకొన్నాక గుహలో లింగరూపంలో ఉన్న స్వామివారిని చూసిన తరువాత అంతవరకు పడిన కష్టం మరిచిపోయి భక్తితో మనసు పులకించిపోకమానదు. కనుక ఆధ్యాత్మికత, ప్రకృతి, ట్రెక్కింగ్ మూడు కలిపితే లింగమయ్య స్వామి వారి జాతర అని చెప్పుకోవచ్చు. అందుకే ఏటా వేలాదిమంది భక్తులు, ప్రకృతి ప్రేమికులు, నగరజీవనంతో విసుగెత్తిపోయున్నవారు స్వామివారి దర్శనం కోసం తరలివస్తుంటారు.   

         

సలేశ్వరం లింగమయ్య స్వామివారి ఆలయం ఏవిధంగా చేరుకోవాలంటే...  


సలేశ్వరం లింగమయ్య స్వామివారి ఆలయం శ్రీశైలానికి సుమారు 40 కిమీ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి వెళ్ళే శ్రీశైలానికి వెళ్ళే మార్గంలో 150 మైలురాయి వద్ద నుంచి నల్లమల అడవులలోకి మలుపు తిరిగి 25 కిమీ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. దానిలో 20 కిమీ వాహనంలో చేరుకోవచ్చు. మిగిలిన 5 కిమీ కాలినడక తప్పదు. ఈ నాలుగు రోజులు, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్‌ నుంచి సలేశ్వరం వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. వైష్ణోదేవి యాత్రకు వెళ్లలేకపోతున్నవారు మన రాష్ట్రంలోనే కొండకోనల్లో వెలిసిన  సలేశ్వరం లింగమయ్య స్వామివారి జాతరకు వెళితే అంతకంటే గొప్ప అనుభూతి పొందవచ్చు. 


Related Post