ఈ వృద్ధదంపతులకు ఆసరా లభిస్తుందా?

March 12, 2019
img

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అజంనగర్ వాసులైన మంతు బసవయ్య (80), లక్ష్మి (70) వృద్ధ దంపతులకి అన్నీ సినిమా టైపు కష్టాలే.  

వారికి ఆరుగురు కొడుకులు ఉన్నారు. వారిలో ఒకరు ప్రభుత్వోద్యోగి. కానీ ఎవరూ వారిని ఆదుకోకపోవడంతో రోడ్డునపడ్డారు. కొడుకు ప్రభుత్వోద్యోగి అయిన పాపానికి ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛను పొందడానికి వారు అనర్హులయ్యారు.  

వారికి 9.17 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. కానీ భూరికార్డుల ప్రక్షాళన తరువాత వారికి పట్టాదారు పాసుపుస్తకం అందలేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబందు సొమ్ము అందడం లేదు. 

అది ఇవ్వలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని భూపాలపల్లి తహశీల్దార్ డిమాండ్ చేశారు. కానీ అంత డబ్బు లేకపోవడంతో ఆ వృద్దదంపతులిరువురూ తహసిల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారు. చివరికి ధర్నా కూడా చేసినా ఫలితం లేకపోవడంతో, “లంచం ఇవ్వడానికి మా వద్ద డబ్బు లేదు. సంపాదించి తెచ్చి ఇచ్చేందుకు వృద్ధులమైన మాకు శక్తి లేదు. కనుక లంచం కోసం బిచ్చమెత్తుతున్నాము,” అంటూ వ్రాసిన ఫ్లెక్సీ బ్యానరు, ప్లకార్డులు పట్టుకొని పట్టణంలో బిచ్చం ఎత్తడం మొదలుపెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వరులు తక్షణం వారికి పట్టాదారు పాసు పుస్తకం అందజేయాలని ఆర్డీఓ ఈ వెంకటాచారిని ఆదేశించడంతో అదే రోజు సాయంత్రానికల్లా వారి భూమిలో 4.10 ఎకరాలకు పాసుపుస్తకం అందజేశారు. మిగిలిన భూమిపై వివాదం ఉన్నందున దానిని పరిష్కరించిన తరువాత దానికి కూడా పాసుపుస్తకం అందజేస్తామని ఆ వృద్ధ దమపతులకు హామీ ఇచ్చారు. ఇదంతా జరిగి రెండున్నర నెలలయింది. అయినా ఇంతవరకు వారికి మిగిలిన భూమికి పాసుపుస్తకం ఇవ్వలేదు. కొడుకులు వారిని పట్టించుకోవడం లేదు. 

చివరికి తమ గోడును సిఎం కేసీఆర్‌కు మొరపెట్టుకోవాలని వారిరువురూ సోమవారం ఉదయం తెలంగాణ భవన్‌ వద్దకు చేరుకొని సాయంత్రం వరకు పడిగాపులు కాశారు కానీ సిఎం అపాయింట్ మెంట్ లేకపోవడంతో వారు నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ వృద్దదంపతులకు చేతిలో అన్నీ ఉన్నా ఈ వయసులో ఈ కష్టాలు ఏమిటో? వాటిని ఎవరు ఎప్పడూ తీరుస్తారో? 

Related Post