ఆమె ఆశయం మహోన్నతం: వనపర్తి కలెక్టర్ శ్వేతా మోహంతీ

February 09, 2019
img

వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మోహంతీ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ ఆమె గొప్పదనం గురించి జిల్లా వాసులకు ముఖ్యంగా విద్యార్ధినులకు, మహిళలకు, ఉపాద్యాయులకు, రైతులకు చాలా బాగా తెలుసు. ఆమె జిల్లాకు వచ్చినప్పటి నుంచి జిల్లాలో పాఠశాలలు, వాటిలో విద్యార్ధుల పరిస్థితులు మెరుగుపరచడంపై దృష్టి సారించి తదనుగుణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు.  

జిల్లాలోని 110 ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8,000 మంది విద్యార్ధినులకు రక్తపరీక్షలు చేయించగా వారిలో 40 శాతం మంది బాలికలకు రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. ముందుగా వారందరికీ మధ్యాహ్నభోజనం పధకం కింద పౌష్టికాహారం అందేవిధంగా చర్యలు చేపట్టారు. అలాగే రక్తహీనతను నివారించేందుకు అవసరమైన మందులు రప్పించి పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాద్యాయులకు అందజేసి ఆ బాలికలకు క్రమం తప్పకుండా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఆమె చేపట్టిన ఈ చిన్న చిన్న చర్యలతో కేవలం 6 నెలలలోనే రక్తహీనత ఉన్న బాలికల సంఖ్య 40 శాతం నుంచి 4 శాతానికి తగ్గిపోయింది. 


యుక్తవయసుకు వచ్చిన విద్యార్ధినులు రుతుస్రావం సమయంలో తీవ్ర ఇబ్బందులుపడుతూ, ఆ కారణంగా అనారోగ్యానికి గురవుతునట్లు గుర్తించారు. వారు ఖరీదైన శానిటరీ నాప్ కిన్స్ కొనుకొనేస్థితిలో లేరని గుర్తించిన శ్వేతా మోహంతీ వారందరికీ ప్రభుత్వం తరపున శానిటరీ నాప్ కిన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారికి ఆ సమయంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉపాద్యాయుల ద్వారా వివరింపజేస్తున్నారు. ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్ధినులకు వైద్యసేవలు అందజేస్తూ వారిని రోగాలబారిన పడకుండా కాపాడుతున్నారు. 


జిల్లాలో అనేక పాఠశాలలో కంప్యూటర్లు లేవని...ఉన్నా అవి పనిచేయని స్థితిలో ఉన్నాయని గుర్తించిన శ్వేతా మోహంతీ, ప్రభుత్వం మరియు దాతల సహాయసహకారాలతో కంప్యూటర్లు ఏర్పాటు చేయించి విద్యార్ధులకు కంప్యూటర్, ఇంటర్నెట్ ను ఉపయోగించడం నేర్పించుతున్నారు. స్వచ్ఛంద సంస్థలను, యువతను ప్రోత్సహించి విద్యార్ధులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు.   

ఇక వనపర్తి వేరుశనగకు మంచిపేరుందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ నాణ్యమైన వేరుశనగ పండిస్తున్నప్పటికీ జిల్లా రైతులు తమ శ్రమ, పెట్టుబడికి తగినంత లాభం పొందలేకపోతున్నారని గుర్తించిన కలెక్టర్ శ్వేతా మోహంతీ, వేరుశనగలను అమ్ముకోవడం కంటే వాటి నుంచి నూనె తీసి అమ్ముకోగలిగితే ఎక్కువ లాభం లభిస్తుందని వారికి నచ్చచెప్పి మహిళా సంఘాల చేత వేరుశనగ ప్రాసిసెయింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు తోడ్పడ్డారు. వాటిలో నూనెతో పాటు చక్కీలు, పొడులు వంటి అనేక పదార్ధాలు తయారవుతున్నాయి. అక్కడ తయారైన ఉత్పత్తులు ఇప్పుడు రాష్ట్రంలోనే కాక ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కొన్ని విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. దాంతో రైతులకు అధికలాభం, మహిళలకు చేతినిండాపని, ఉపాది లభిస్తుండటంతో చుట్టుపక్కల జిల్లాలలో రైతులు కూడా వారి బాటలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. 


ఇవన్నీ కేవలం ఒక్క వ్యక్తి...వనపర్తి కలెక్టర్ శ్వేతా మోహంతీ ఆలోచన, తపన, కృషి, సంకల్పబలం, పట్టుదల కారణంగానే సాధ్యం అయ్యాయి. ఒక మహిళ తలుచుకొంటే ఏమి చేయగలదో ఆచరణలో చేసి చూపించిన ఆమెకు అభినందనలు. 

Related Post