అయ్యో రైతన్న! అంత తొందర ఎందుకే?

February 09, 2019
img

రైతన్నలకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదు. ఒక బ్యాంక్ అధికారి చేసిన చిన్న తప్పు...రైతు తొందరపాటు వలననే అనర్ధం జరిగిపోయింది. 

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలంలోని సత్యగామ గ్రామస్తుడైన అంతారం ఈర్ రెడ్డి(52)కు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌ చేరుకొని కూలిపనులు చేసుకొని బ్రతుకుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం కింద మొదటివిడతలో రూ.32,800 చెక్కు అందుకున్నాడు. కానీ రెండవ విడత సొమ్మును రైతుల ఖాతాలలో జమా చేసేటప్పుడు ఒక బ్యాంక్ అధికారి ఈర్ రెడ్డి ఇంటి పేరు, ఐ.ఎఫ్.ఎస్.సి. కోడ్ తప్పుగా వ్రాయడంతో రెండవ విడత రైతుబంధు సొమ్ము ఈర్ రెడ్డి బ్యాంక్ ఖాతాలో జమా అవలేదు. దాని కోసం ఈర్ రెడ్డి రెండుమూడుసార్లు హైదరాబాద్‌ నుంచి నారాయణ్ ఖేడ్ వచ్చి బ్యాంక్ చుట్టూ తిరిగినా డబ్బు జమా కాలేదు. 

దాంతో ఈర్ రెడ్డిలో ఆందోళన మొదలైంది. ఒకవేళ తన పేరిట ఉన్న భూమిని తనకు తెలియకుండా ఎవరైనా నకిలీ దృవపత్రాలతో మరొకరికి బదలాయించుకొన్నారేమోనని భయపడేవాడని ఈర్ రెడ్డి కుటుంబ సభ్యులు చెప్పారు. ఎంత నచ్చజెప్పినా భూమి పోగొట్టుకొన్నానేమోననే దిగులుపడుతుండేవాడని చెప్పారు. మొన్న బుదవారంనాడు ఓసారి ఊరెళ్ళి పొలం చూసుకొని వస్తానని బయలుదేరిన ఈర్ రెడ్డి మళ్ళీ తిరిగి రాలేదు. తన పొలంలోనే ఉన్న వేపచెట్టుకు ఊరి వేసుకొని చనిపోయాడు. ఒక బ్యాంక్ అధికారి చేసిన చిన్న పొరపాటు, ఈర్ రెడ్డి తొందరపాటుతో నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈర్ రెడ్డి భార్య పిల్లలు రోడ్డున పడ్డారు.

Related Post