అద్భుతం.. మధులిక కోలుకొంటోంది

February 08, 2019
img

భరత్ అనే ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న మధులిక మెల్లగా కోలుకొంటోందని ఆమెకు వైద్యచికిత్సలు అందిస్తున్న మలక్ పేట యశోదా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 

యశోదా ఆసుపత్రి సిఓఓ విజయ్ కుమార్ శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ, “ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చేరిన మధులిక స్పృహలోకి వచ్చింది. మెల్లగా కోలుకొంటోంది. మేము మాట్లాడితే సైగలతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. రెండు చేతులు పైకి లేపగలుగుతోంది. మా వైద్యబృందం వరుసగా చేసిన శస్త్రచికిత్సల వలన ఆమె కోలుకోగలిగింది. ఆమె తల వెనుక భాగంలో, వెన్నుపూస, రెండు చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. వాటిని సరిదిద్దేందుకు మా వైద్యబృందం వరుసగా 5 శస్త్ర చికిత్సలు చేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ ఆమె శరీర అంతర్భాగాలకు ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. కనుక మరో 48 గంటల పాటు ఆమె ప్రమాదకరస్థితిలో ఉన్నట్లుగానే భావిస్తున్నాము. ఆమెకు ఇన్ఫెక్షన్ సోకకుండా మా వైద్యులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడుతుందని మేము ఆశిస్తున్నాము,” అని చెప్పారు. 

పుర్రె, వెన్నెముక, నరాలు, కడుపు, చేతులపై అంత తీవ్రగాయాలై, తీవ్ర రక్తస్రావం జరిగినప్పటికీ మధులిక కోలుకొంటుండటం చాలా అద్భుతమే. నిన్న ఆమె పరిస్థితిని చూసినవారు ఆమె బ్రతుకుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ యశోదా ఆసుపత్రి వైద్యులు తమ అద్భుతమైన వృత్తి నైపుణ్యంతో ఆమెకు పునర్జన్మ ప్రసాదించారు. అందుకు వారందరికీ అభినందనలు. మధులికపై దాడిచేసిన భరత్ ను పోలీసులు పట్టుకొని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి రిమాండ్ విధించింది.

Related Post