మిర్యాలగూడ హత్య కేసు: తాజా సమాచారం

September 15, 2018
img

మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ప్రణయ్ కుమార్ అనే యువకుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడు. పోలీసులు అతని మావగారు మారుతీ రావు, వారి బందువు శ్రావణ్ లపై కేసులు నమోదు చేశారు. 

ఎస్.పి. రంగనాధ్ చెప్పిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలో చర్చి బజార్ ప్రాంతంలో నివసిస్తున్న పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ (24) ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినవాడు. బీటెక్ పూర్తి చేసిన అతను త్వరలో కెనడా వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. అతని తండ్రి బాలాస్వామి మిర్యాలగూడలో ఎల్.ఐ.సి. కార్యాలయంలో పనిచేస్తున్నారు. 

ప్రణయ్ కుమార్ భార్య అమృత వర్షిణి. మిర్యాలగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తిరునగరు మారుతీరావు దంపతులకు ఆమె ఏకైక కుమార్తె. ప్రణయ్ కుమార్, అమృత వర్షిణి హైదరాబాద్‌లో చదువుకొంటున్న సమయంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి పరిచయం ప్రేమకు దారి తీసింది. కానీ వైశ్యసామాజిక వర్గానికి చెందిన మారుతీరావు వారి ప్రేమను అంగీకరించకపోవడంతో వారు ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకొన్నారు. 

అప్పటి నుంచి వారిరువురూ మిర్యాలగూడలోని ప్రణయ్ కుమార్ తల్లి తండ్రులతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. వారు హాయిగా జీవిస్తున్నప్పటికీ పగతో రగిలిపోతున్న మారుతీరావు ప్రణయ్ కుమార్ ను బెదిరిస్తూనే ఉన్నాడు. తన తండ్రి వలన తన భర్తకు ప్రాణహాని ఉందని అనుమానించిన అమృతవర్షిణి డి.ఎస్.పి.ని కలిసి ఫిర్యాదు చేసింది. పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో మారుతీరావు తన వైఖరి మార్చుకొని వారితో ప్రేమగా వ్యవహరించసాగాడు. 

తండ్రిలో మార్పు చూసి అమృతవర్షిణి కూడా చాలా సంతోషించింది. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో ఆ దంపతుల ఆనందానికి హద్దే లేదు. ప్రణయ్ కుమార్ స్వయంగా తరచూ ఆమెను కారులో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు చేయించి తీసుకువస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం వారు ఆసుపత్రికి వెళ్ళి బయటకు వస్తుండగా గేటు వద్ద మాటు వేసిన ఒక గుర్తు తెలియని వ్యక్తి వెనుకనుంచి వచ్చి ప్రణయ్ కుమార్ మెడపై కత్తితో రెండుసార్లు బలంగా వేటు వేసి పారిపోయాడు. ప్రణయ్ కుమార్ గేటువద్దే కుప్పకూలిపోయి మరణించాడు. 

ప్రణయ్ కుమార్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు మారుతీ రావు, వారి బందువు శ్రావణ్ లపై కేసులు నమోదు చేశారు. పగతో రగిలిపోతున్న మారుతీరావు కిరాయి హంతకుడిని మాట్లాడుకొని అల్లుడిని హత్య చేయించినట్లు అనుమానిస్తున్నామని ఎస్.పి. రంగనాధ్ మీడియాకు తెలిపారు. పోలీసులు వారిరువురినీ అదుపులో తీసుకొన్నారు. కోర్టు అనుమతితో వారిని విచారించిన తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని ఎస్.పి. రంగనాధ్ చెప్పారు. 

Related Post