ముందు తెదేపాకు సంప్రోక్షణ జరిగిందా?

July 17, 2018
img

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతీ 12 ఏళ్ళకు ఒకసారి జరిగే ‘మహా సంప్రోక్షణ’ పేరిట జరిగే మరమత్తు పనులకోసం ఆగస్ట్ 9వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి 17వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఏకంగా తొమ్మిది రోజులపాటు కొండపైకి భక్తులు ఎవరినీ అనుమతించకూడదనే టిటిడి నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఏపి సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మహా సంప్రోక్షణ సమయంలో కూడా పరిమిత సంఖ్యలో ఆలయంలోకి భక్తులను అనుమతించాలని టిటిడిని ఆదేశించారు. 

బాబు నిర్ణయాన్ని స్వరూపానందేంద్ర స్వామి స్వాగతించారు. దేవాలయాల వ్యవస్థలను ప్రభుత్వ వ్యవస్థలుగా భావించరాదని, వాటికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకోదలిస్తే ముందుగా పీఠాధిపతులను, ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకొంటే మంచిదని సూచించారు. 

మహా సంప్రోక్షణకోసం ఏకంగా తొమ్మిది రోజులు తిరుమల ఆలయాన్ని మూసివేయడాన్ని వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా తీవ్రంగా తప్పు పట్టారు. తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల నేపధ్యంలో తొమ్మిది రోజులు కొండపైకి భక్తులు ఎవరినీ అనుమతించకూడదనే టిటిడి నిర్ణయం అనుమానం కలిగిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కారణాలు ఏవైతేనేమి, టిటిడి నిర్ణయంతో ప్రజలు టిడిపికి తలంటడంతో దిగిరాక తప్పలేదు. అయితే, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా మహా సంప్రోక్షణ కార్యక్రమాలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక తొమ్మిది రోజులకు బదులు మూడు నాలుగు రోజులకు దానిని కుదించి, భక్తులకు దర్శనాలు నిలిపివేసి ఆ కార్యక్రమాలు చేపడితే మంచిదేమో.

Related Post