ఖైరతాబాద్ గణపతి తయారీ పనులు షురూ!

May 26, 2018
img

గణపతి నవరాత్రుల సందర్భంగా దేశంలో వివిధ రాష్ట్రాలలో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాలలో చాలా ప్రసిద్ధి చెందినవాటిలో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం కూడా ఒకటి. ఆ విగ్రహ నిర్మాణపనులు శుక్రవారం సాయంత్రం లాంచనంగా మొదలయ్యాయి. ఆ విగ్రహానికి ఉపయోగించబోయే ఒక ప్రధానమైన కర్రకు పూజతో ప్రతీ ఏటా విగ్రహనిర్మాణపనులు మొదలవుతాయి. ఖైరతాబాద్ లైబ్రేరీ ప్రాంగణంలో ఏర్పాటుచేయబోయే మంటపంలో శుక్రవారం సాయంత్రం ఈ పూజాకార్యక్రమం జరిగింది. 

దీనికి భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రధానకార్యదర్శి భగవంతరావు, శిల్పి రాజేంద్రన్‌, ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, రాజ్‌కుమార్‌, మహేష్‌ యాదవ్, మహేందర్‌ బాబు, మధుకర్‌ యాదవ్‌, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, తెరాస నేత గజ్జల నాగేష్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రసన్న, ఉత్సవ కమిటీ సభ్యులు ఇంకా అనేకమంది స్థానిక నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. మంటపంలో కర్రకు పూజ చేసిన తరువాత దానిని మంటపంలో శిల్పి నిర్దేశించిన ప్రదేశంలో పాతారు. 

మొట్టమొదటిసారిగా ఈసారి ‘సప్తముఖ గణపతి’ విగ్రహం నిర్మిస్తున్నమని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ తెలిపారు. మహా గణపతిని ఎటువైపు నుంచి చూసినా ఒకేవిధంగా ఉండేలా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఏడు తలల సర్పం తన పడగలతో మహాగణపతి విగ్రహంపై  గొడుగుపట్టినట్లు ఉండేలా నిర్మించబోతున్నామని తెలిపారు. ఈసారి కూడా 60 అడుగుల ఎత్తు విగ్రహమే నిర్మిస్తామని తెలిపారు. త్వరలోనే మహాగణపతి విగ్రహం రూపురేఖలు ఖరారు చేసి, ఆ ఫోటోలను మీడియా ద్వారా ప్రజలకు అందజేస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ తెలిపారు. 


Related Post