అదృష్టం అంటే ఆమెదే..

May 22, 2018
img

దేశంలో కోట్లాదిమంది నిరుపేద మహిళలు, బాలికలు, చిన్నారులు అనేకానేక సమస్యలతో సతమతమవుతూ దయనీయమైన జీవితాలు గడుపుతున్నారు. వారిని ఆదుకొనేనాధుడే కనబడరు. కానీ భారత్ లో పుట్టి, చిన్నవయసులోనే పొరపాటున పాకిస్తాన్ లో ప్రవేశించి అక్కడే పెరిగి పెద్దదైన బధిర,మూగ యువతి గీత మాత్రం చాలా అదృష్టవంతురాలేనని చెప్పవచ్చు. 

సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సినిమా ‘బజరంగీ భాయ్’ చిత్రం విడుదలైన తరువాత ఆ సినిమా కధ ఆమె జీవితకధనే పోలి ఉండటంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఆ తరువాత ఆమె తన తల్లితండ్రులను కలుసుకోవడానికి భారత్ వచ్చింది. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేకమంది దంపతులు ఆమె తమ కుమార్తె అని చెపుతూ ఆమెను తీసుకుపోవడానికి వచ్చారు. కానీ వారిలో ఎవరూ తన తల్లితండ్రులుకారని గీత భావించడంతో ఆమెను మహిళాశిశు సంరక్షణశాఖ అద్వర్యంలో నడుస్తున్న ఇండోర్ లో ఒక సంక్షేమ హాస్టల్ లో ఉంచింది ప్రభుత్వం. 

భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఆమెపై ప్రత్యేకశ్రద్ధ చూపుతున్న కారణంగా ఆమెకు అక్కడ ఆమెకు ఏ లోటు లేకుండా సాగిపోతోంది. యుక్తవయసు వచ్చిన ఆమెకు పెళ్లి చేసే బాధ్యతను కూడా మహిళాశిశు సంరక్షణశాఖ అధికారులే తీసుకొని ఆమెకు తగిన వరుడి కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దానికీ మంచి స్పందన రావడం విశేషం. ఆమెను వివాహం చేసుకోనేందుకు దాదాపు 50 మంది అబ్బాయిలు దరఖాస్తు చేసుకోగా వారిలో 30 మందిని అధికారులు ఎంపిక చేశారు. ఆ 30 మందిలో గీత తనకు నచ్చినవాడిని ఎంపిక చేసుకోబోతోంది. ఆమె ఎంపిక చేసుకొన్నవాడితో ఆమె వివాహం జరిపించదానికి అధికారులు సిద్దంగా ఉన్నారు. 

గీత తన తల్లితండ్రులను చేరుకోలేకపోవడం చాలా బాధాకరమే కానీ ప్రభుత్వమే ఆమెకు అండగా నిలబడి వివాహం చేసి ఆమె జీవితాన్ని చక్కదిద్దడం చాలా గొప్ప విషయమే. దేశంలో ఉన్న కోట్లాదిమంది అనాధ బాలికలు, మహిళల కంటే గీత చాలా అదృష్టవంతురాలే కదా!


Related Post