యద్ధనపూడి సులోచనారాణి మృతి

May 21, 2018
img

ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి (79) మృతి కాలిఫోర్నియాలోని కుపర్టినో అనే ప్రాంతంలో తన కుమార్తె శైలజ నివాసంలో గుండెపోటుతో మరణించారు. 

యద్ధనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లాలో మొవ్వమండలంలోని ఖాజా గ్రామంలో జన్మించారు. ఆమె అనేక కధలు కూడా వ్రాసినప్పటికీ నవల రచయిత్రిగానే ఎక్కువ పేరు పొందారు. తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగంగా భావింపబడిన 1970-90 దశకాలలో ఆమె అనేక కధలు, నవలలు వ్రాశారు. వాటిలో చాలా వరకు ప్రేమ కధలే. ఆ రోజుల్లో ఆమె కధలు, నవలల కోసం తెలుగు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూసి పోటీలుపడీ మరీ చదివేవారు. 

ఆమె నవలలలో ‘ప్రేమ, మహిళల ఆత్మగౌరవం’ ప్రధాన అంశాలుగా ఉండేవి. ముఖ్యంగా మధ్యతరగతి మహిళల మనోభావాలను, వారి ఆశలు, ఆకాంక్షలు, నిత్యజీవితంలో వారు ఎదుర్కొనే అనేక సమస్యలను యద్ధనపూడి సులోచనారాణి తన నవలలలో కళ్ళకు కట్టినట్లు వర్ణించేవారు. కనుక ఆమె నవలలతో ఆ కాలంలో యువతీ యువకులు బాగా కనెక్ట్ అయ్యేవారు. 

ఆమె రచించిన ‘చదువుకొన్న అమ్మాయిలు’ నవల సినిమాగా మొదట రూపొందించబడింది. ఆ తరువాత సినీ పరిశ్రమలో కూడా ఆమె నవలలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆమె రచించిన మీనా, జీవనతరంగాలు, సెక్రెటరీ, రాధాకృష్ణ,. అగ్నిపూలు, ప్రేమలేఖలు, చండీప్రియ, విచిత్రబంధం, బంగారుకాలం నవలల ఆధారంగా నిర్మించబడిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అవికాక ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమర హృదయం, గిరిజా కళ్యాణం, వెన్నెల్లో మల్లిక, గమనం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, కలల కౌగిలి వంటి అనేక నవలలు వ్రాశారు. వాటికీ ఆనాడు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.  

సరిగ్గా మూడు రోజుల క్రితమే ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెద్దిభొట్ల సుబ్బరామయ్య  మృతి చెందారు. అయన కూడా మధ్యతరగతి ప్రజల జీవితాలను కధావస్తువుగా తీసుకొని అనేక కధలు వ్రాశారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ తెలుగు రచయితలు మరణించడం చాలా బాధాకరమే.

Related Post