మర్రిచెట్టుకు సెలైన్!

April 20, 2018
img

మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో క్రీస్తన్ పల్లి గ్రామంలో 700 సం.ల వయసున్న మర్రిచెట్టు ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. పిల్లలమర్రిగా ప్రసిద్దమైన ఆ చెట్టు శాఖోపశాఖలుగా సుమారు 4 ఎకరాలలో విస్తరించి ఉంది. ఆ కారణంగా ఇది రాష్ట్రంలో ప్రత్యేక పర్యాటక్షరణ కేంద్రంగా నిలుస్తోంది. దానిని చూసేందుకు దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కనుక దానిని కాపాడేందుకు అటవీశాఖ, జిల్లా అధికారులు చాలా కృషి చేస్తున్నారు. తెగుళ్ళు, వేసవి ఎండలతో బలహీనపడుతున్న ఆ పిల్లల మర్రిచెట్టును కాపాడుకొనేందుకు తాజాగా వారు చేస్తున్న ఒక సరికొత్త ప్రయోగం దేశంలో యావత్ మీడియా దృష్టిని ఆకర్షించడంతోజాతీయ మీడియాలో దీని గురించి కధనాలు, ఫోటోలు, వీడియోలు ప్రచురితమవుతున్నాయి.  . 

తెగుళ్ళు తట్టుకొని నిలబడేందుకు అధికారులు దానికి కొన్ని మందుల మిశ్రమంతో కూడిన సెలైన్ ఎక్కిస్తున్నారు. చెట్టుకు సెలైన్ ఎక్కించడం ఎవరూ ఎక్కడా చూసి ఉండలేదు కనుక అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

మొదట సాధారణ పద్దతిలోనే అన్ని ప్రధాన ఊడలకు మందు పిచికారి చేసి, చెట్టుకు అవసరమైన నీటిని అందించారు. కానీ తెగుళ్ళ కారణంగా మర్రిచెట్టు క్రమంగా బలహీనపడుతూనే ఉంది. అప్పుడు చెట్టుకు మందుల మిశ్రమంతో కూడిన సెలైన్ ఎక్కిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనరావడంతో అధికారులు ఈ ప్రయోగం చేస్తున్నారు. దీనివలన ఆశించినంతగా ఫలితాలు రాకపోయినా చెట్టు పరిస్థితి ఇదివరకు కంటే కొంచెం మెరుగుపడిందని అధికారులు చెపుతున్నారు. ఈ 700 సం.ల వయసున్న మర్రిచెట్టును రక్షించుకోవడానికి ఏమైనా చేస్తామని చెపుతున్నారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ దీని గురించి ప్రత్యేకశ్రద్ధ చూపిస్తూ, ఈ ప్రయోగాన్ని, ఫలితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. 


Related Post