నేటి నుంచి మేడారంలో పూజలు మొదలు

January 17, 2018
img

ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వరకు మేడారం సమక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అందుకు నేటి నుంచి పూజాకార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న మండమెలిగె పండుగతో మేడారం జాతర మొదలవుతుంది. అప్పటి నుంచి ఫిబ్రవరి 3న జాతర ముగిసే వరకు మేడారంకు రోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తూనే ఉంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు తరలివచ్చి సమక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకొంటున్నారు. జనవరి 31న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను ఊరేగింపుగా వారి గద్దెలకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన సమ్మక్కతల్లి తన గద్దెకు చేరుకొంటుంది. 

అలహాబాద్ కుంభమేళా తరువాత దాదాపు ఆ స్థాయిలో భక్తులు పాల్గొనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమిది. మేడారం సమక్క సారలమ్మ జాతరకు ఏటా సుమారు కోటిమంది భక్తులు తరలివస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపి, ఓడిశా, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు జాతరకు హాజరవుతుంటారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే ఏటా చాలా బారీగా ఏర్పాట్లు చేస్తుంటుంది. 

అయితే, గత రెండునెలలుగా అదిలాబాద్ తదితర ప్రాంతాలలో గిరిజనులకు లంబాడీ తెగల ప్రజలకు మద్య ఘర్షణలు జరుగుతున్నందున, ఈ జాతరలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొంటోంది. 

ఈ ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని సమక్కతల్లి ఆలయ పూజారులు పీరీల కృష్ణ, ఆనందరావు, రమేష్, స్వామి జాతరకు వచ్చే భక్తులకు, రాజకీయ నేతలకు నిన్న ఒక విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల ఆరాధ్యదైవాలు వెలిసిన మేడారం జాతర పరిసరాలను రాజకీయ వేదికగా మార్చవద్దని కోరారు. పవిత్రమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికతకు తప్ప రాజకీయాలు చోటులేదని అన్నారు. కనుక భక్తుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ఎవరూ మాట్లాడవద్దని, వ్యవహరించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. జాతర సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని పూజారులు కోరారు. 

Related Post