కోమటిరెడ్డికి తెరాస ఎమ్మెల్యే సవాల్

December 11, 2017


img

నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) సీఈవో మదన్ మోహన్ ను ఫోన్లో దుర్భాషలాడిన నకిరేకల్ తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అయన ఈ సమస్యపై నుంచి అందరి దృష్టిని మళ్ళించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాటల యుద్ధం ప్రారంభించినట్లున్నారు. 

దేవరకొండ సొసైటీ బ్యాంకులో కొంతమంది ఉద్యోగులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో, ఆ సంస్థ డిజిఎంగా పనిచేస్తున్న లక్ష్మి దర్యాప్తు జరిపి 21 మంది ఉద్యోగులను 2013 లో సస్పెండ్ చేశారు. కానీ విచిత్రమేమిటంటే, సస్పెండ్ అయినవారే ఆమెపై ఎదురుకేసులు పెట్టడంతో ఆమె సస్పెండ్ అయ్యారు. గత రెండేళ్ళుగా ఆమె జీతం అందకపోవడంతొ ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. 

ఈ వ్యవహరంలో ఎమ్మెల్యే వేముల వీరేశం కలుగజేసుకొని, ఆ బ్యాంక్ సీఈఓ మదన్ మోహన్ తో ఫోన్లో మాట్లాడుతూ సహనం కోల్పోయి నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. అయన మాట్లాడిన మాటల ఆడియో రికార్డ్ మీడియా చేతిలో పడటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. 

ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుగజేసుకొంటూ, తెరాస ఎమ్మెల్యేలు అధికార గర్వంతో విర్రవీగుతూ అధికారులతొ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, హద్దు మీరితే ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారని హెచ్చరించారు. మళ్ళీ ఎన్నికలలో పోటీకి నిలబడితే వీరేశానికి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదని ఎద్దేవా చేశారు.

కోమటిరెడ్డి జోక్యం చేసుకోవడంతో తెరాస ఎమ్మెల్యే అయనతో మాటల యుద్దం ప్రారంభించారు. “కోమటిరెడ్డి సవాలును నేను స్వీకరిస్తున్నాను. కోమటిరెడ్డి సోదరిలిద్దరూ జిల్లా రాజకీయాలను డబ్బుతో బ్రష్టు పట్టించేరు. అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధైర్యం ఉంటే ఓ వందకోట్లు పట్టుకు వస్తే నేను ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటో పెట్టుకొని ఆయనపై పోటీకి సిద్దం. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ అయన ఓడిపోతే మాటకు కట్టుబడి రాజకీయ సన్యాసం చేయడానికి ఆయన సిద్దమేనా?” అని సవాలు విసిరారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం ఒక బ్యాంక్ ఉన్నతాధికారి తరపు వఖాల్తా తీసుకొని ఆమెకు న్యాయం చేసేందుకు కృషి చేయడం అభినందనీయమే. కానీ ఆ ప్రయత్నంలో మరొక ఉన్నతాధికారి పట్ల అంత అసభ్య పదజాలం ఉపయోగించడం, ఫోన్లో బెదిరించడం పైగా ఆవిధంగా మాట్లాడటాన్ని గట్టిగా సమర్ధించుకోవడం శోచనీయం. విస్మయం కలిగిస్తుంది.

ఈ బెదిరింపుల వ్యవహారంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నప్పుడు తెరాస ఎమ్మెల్యే వీరేశం మద్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో వాగ్వాదానికి దిగడం దేనికంటే ఈ సమస్యపై నుంచి దృష్టి మళ్ళించడానికేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


Related Post