భరత్ రెడ్డి...నో రిగ్రెట్స్!

December 11, 2017


img

నిజామాబాద్ జిల్లా నవీపేటలో అభంగపట్నంలో ఇద్దరు దళిత యువకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన భాజపా నేత భరత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ పోలీసులకు లొంగిపోయాడు. ఆ వ్యవహారం జరిగినప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయన కోసం నిజామాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. చివరికి తనంతట తానే పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు అతనిని నిజామాబాద్ తరలించారు. ఈరోజు కోర్టులో హాజరుపరిచబోతున్నారు. 

అతను పోలీసులకు లొంగిపోయినప్పటికీ అతనిలో ఏమాత్రం పశ్చాతాపం కానరాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఆరోజు మేము ‘దొరల రాజ్యం’ అనే షార్ట్ ఫిలిం కోసమే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాము. నేటికీ అనేక గ్రామాలలో దళితులపై దొరల పెత్తనం కొనసాగుతూనే ఉంది. అదే లోకానికి చాటి చెప్పాలనే ఉద్దేశ్యంతో మేము షార్ట్ ఫిలిం కోసం ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తే, దానిని సోషల్, ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలు వక్రీకరించాయి. అ కారణంగానే నాపై కేసు నమోదు అయ్యింది. నాపై జరిగిన ఈ కుట్రను తప్పకుండా చేధిస్తాను. దీనిపై న్యాయపోరాటం చేస్తాను. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశాను,” అని భరత్ రెడ్డి చెప్పారు.

అయితే భరత్ రెడ్డి తమను కర్రతో కొట్టి, బూతులు తిడుతూ, రోడ్డుపక్కనే ఉన్న బురదగుంటలో ముంచడం అన్నీ వాస్తవమేనని అవి షార్ట్ ఫిలిం కోసం తీసినది కాదని లక్ష్మణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు దళిత యువకులు స్పష్టం చేశారు. అతను తమను బలవంతంగా హైదరాబాద్ తరలించి అక్కడ 20 రోజులపాటు వేర్వేరు ప్రాంతాలలో తిప్పి తమను చాలా భయపెట్టాడని, అందుకే షార్ట్ ఫిలింలో నటించామని, డబ్బులు పుచ్చుకొన్నామని చెప్పామని అన్నారు. భరత్ రెడ్డిఐ అరెస్ట్ చేసి చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని వారిరువురూ డిమాండ్ చేశారు. భరత్ రెడ్డి ఒక హత్యకేసులో నిందితుడుగా ఉన్న విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. దానిపై కూడా హైకోర్టులో విచారణ జరుగుతోందని చెప్పారు. 

భరత్ రెడ్డి ఆ ఇద్దరు దళిత యువకుల పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారిని కిడ్నాప్ చేసి భయపెట్టడం వంటి చట్టవ్యతిరేక పనులు చేశారు. వారిపట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించి, మళ్ళీ దానిని కప్పి పుచ్చుకోవడానికి షార్ట్ ఫిలిం అనే కొత్త నాటకం మొదలుపెట్టడం విడ్డూరం. అదికూడా దొరల పెత్తందారిని చాటిచెప్పడానికని చెప్పుకోవడం సిగ్గుచేటు. సమాజంలో నేటికీ దళితుల పట్ల పెత్తందారుల తీరు మారలేదని చెప్పడానికి ఏ షార్ట్ ఫిలిం అవసరం లేదు. భరత్ రెడ్డే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇంత జరిగినా భరత్ రెడ్డిలో ఏమాత్రం పశ్చాతాపం కనబడకపోగా వితండవాదన చేస్తున్నారు. కనుక ఆ నిరుపేద దళిత యువకులకు జరిగిన అన్యాయాన్ని మన ప్రభుత్వం, చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలైనా సరిచేస్తాయో లేదో చూడాలి.         



Related Post