ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో మరో ట్విస్ట్

December 09, 2017


img

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితంలాగే ఆమెకు సంబంధం ఉన్న ఏ విషయమైనా ఊహించని మలుపులు తిరుగుతుండటం విశేషం. ఆమె ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్.కె.నగర్ ఉపఎన్నికలు కూడా అనేక మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. 

మొదటిసారి ఉపఎన్నికలను ప్రకటించినప్పుడు, అభ్యర్ధులు విచ్చలవిడిగా డబ్బు పంచారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆఖరు నిమిషంలో ఉపఎన్నికలు రద్దు అయ్యాయి. మళ్ళీ ఈ నెల 21న ఉపఎన్నికలు ప్రకటించగానే, ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్ నటుడు విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఆ తరువాత సాంకేతిక కారణాలు చూపి రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ ను తిరస్కరించడం, అందుకు నిరసనగా విశాల్ ధర్నా చేయడం, అతని నామినేషన్ ఫారం పై సంతకం చేసిన ఇద్దరు మద్దతుదారులు అకస్మాత్తుగా అదృశ్యం అవడం వంటివన్నీ ఊహించని పరిణామాలే. 

తాజాగా మరొక ఊహించని పరిణామం జరిగింది. ఆర్.కె.నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అన్నాడిఎంకె నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి విశాల్, దీపల నామినేషన్స్ తిరస్కరించారని, అన్నాడిఎంకె అభ్యర్ధి మధుసూదన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని డిఎంకె పార్టీ ఆరోపించడంతో కేంద్ర ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొని, రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న వేలుస్వామిని సస్పెండ్ చేసి ఆయన స్థానంలో ప్రవీణ్ పి నాయర్ అనే మరో వ్యక్తిని నియమించింది. 

ఈసీ నిర్ణయాన్ని నటుడు విశాల్ స్వాగతిస్తూ “నా నామినేషన్ తిరస్కరించినందుకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్.కె.నగర్ రిటర్నింగ్ అధికారిని మార్చాలనే ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణకు నేను చేస్తున్న పోరాటంలో ఇదే తొలివిజయంగా భావిస్తున్నాను. ఆర్.కె.నగర్ ఉపఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నాను. ఈసీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు. 


Related Post