కాంగ్రెస్ కుటిల వ్యూహాన్ని తిప్పికొట్టిన జసోదాబెన్

December 09, 2017


img

గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించి, భాజపాను దెబ్బతీయాలని కుటిలఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీకి మోడీ ఆర్దాంగి శ్రీమతి జసోదాబెన్ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఆమెను తన భార్యగా పేర్కొన్నప్పటికీ, మొదటి నుంచి ఆమెకు దూరంగానే ఉంటున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఆమె మాత్రం తన భర్త ఆయురారోగ్యాల కోసం నేటికీ పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు. ఆయన గౌరవానికి భంగం కలిగించేవిధంగా ఏనాడు ప్రవర్తించలేదు. పైగా తన భర్త కుటుంబం కంటే దేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ యావత్ దేశప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానని ఆమె చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దేశప్రజలందరికీ తెలిసిన ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి కూడా బాగానే తెలుసు. అయినప్పటికీ గుజరాత్ ఎన్నికలలో తమ పార్టీకి గట్టి సవాలు విసురుతున్న ప్రధాని మోడీని ఇబ్బంది కలిగించి నిలువరించేందుకు, శ్రీమతి జసోదాబెన్ ను తమ పార్టీ తరపున పోటీ చేయవలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరింది. అదే ఆమె స్థానంలో మరొక మహిళ ఉండి ఉంటే ఎగిరి గంతేసి టికెట్ తీసుకొని, ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించి ఉండేవారేమో కానీ శ్రీమతి జసోదాబెన్ మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారని ఆమె సమీప బంధువు ఒకరు తెలిపారు.

ఆ భార్యాభర్తల మద్య నెలకొనున్న దూరాన్ని కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవాలని చూసింది. అందుకు ఆమె ఇచ్చిన సమాధానం కాంగ్రెస్ పార్టీకి చెప్పుదెబ్బ వంటిదేనని చెప్పవచ్చు. తన భర్త మహాశక్తివంతుడైన దేశ ప్రధాని అయినప్పటికీ శ్రీమతి జసోదాబెన్, చాలా నిరాడంబరంగా, ఒక సామాన్య మద్య తరగతి మహిళలాగే జీవితం గడుపుతుంటారు. ఏనాడూ భర్త గురించి పల్లెత్తుమాట చెడ్డగా అనలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆఫర్ ను తిరస్కరించడం ద్వారా ఆమె మరోమారు తన హుందాతనం ప్రదర్శించుకొన్నారు. 


Related Post