ప్రపంచ తెలుగు మహాసభలకు అందరూ ఆహ్వానితులే

December 09, 2017


img

డిసెంబర్ 15 నుంచి 5 రోజులపాటు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి. ఈ మహాసభల ఏర్పాట్లకోసం నియమించిన క్యాబినెట్ సబ్-కమిటీకి అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కడియం గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఇది తెలుగువారందరి పండుగ. కనుక ఈ మహాసభలకు తెలుగువారు అందరూ ఆహ్వానితులే. అందరూ కలిసి ఈ మహాసభల ద్వారా తెలుగు బాష ఔనత్యం ప్రపంచానికి చాటిచెపుదాము. 

తెలంగాణా రాష్ట్రం నుంచి 6,000 మంది ఈ సభలలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేయించుకొన్నారు. 40 దేశాల నుంచి 160 మంది వీటిలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి 1,167 మంది ఈ మహాసభలలో పాల్గొనేందుకు తమ పేర్లను నమోదు చేయించుకొన్నారు. సుమారు 7,000 మందికి పైగా ఈ మహాసభలలో పాల్గొనబోతున్నారు.

 తెలంగాణా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతున్న తెలుగు పండుగ కనుక, వీటిలో తెలంగాణా బాషా, యాస, సాహిత్యం, కళలు, వంటలు, సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు, కవులు కళాకారులు, సాహితీవేత్తలు..ఇలా తెలంగాణాకు సంబందించిన ప్రతీ అంశం లోకానికి గట్టిగా చాటి చెప్పడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇటువంటి అపురూపమైన అవకాశం మాకు లభించడం చాలా ఆనందంగా ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, బాషాభిమానులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ మహాసభలకు విచ్చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ అతిధులుగా భావించి వారికి భోజన, వసతి, రవాణా మొదలైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము,” అని మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 


Related Post