ఇక వరంగల్ లో కూడా సినీవారం

December 08, 2017


img

తెలంగాణాలో ఇప్పుడు అనేకమంది ఔత్సాహికులు షార్ట్ ఫిలింస్ తీస్తున్నారు. అందుకు కారణం వాటిని హైదరాబాద్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రతీ శనివారం ‘సినీవారం’ పేరిట ఉచితంగా ప్రదర్శించుకొనేందుకు, తిలకించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడమేనని చెప్పవచ్చు. ఈ సందర్భంగా ఆ రంగంలో ఉన్న ఇతరులతో తమ అభిప్రాయలు పంచుకొనేందుకు అవకాశం కలుగడంతో షార్ట్ ఫిలిం మేకింగ్ లో దర్శకత్వం, కధా రచన, డైలాగ్స్, కెమెరా వర్క్, సంగీతం వంటి వివిధ శాఖలలో ఆసక్తి, అనుభవం ఉన్నవారు ఈ ‘సినీవారం’ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. 

ఈ కార్యక్రమానికి ఔత్సాహికుల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి, ఈ కార్యాక్రమాన్ని వరంగల్ రూరల్ జిల్లాలో కూడా అమలుచేసేందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆమోదం తెలిపారు. వరంగల్ పట్టణంలో హంటర్ రోడ్డులో గల రీజినల్ సైన్స్ సెంటరులో ప్రతీ శనివారం ‘సినీవారం’ కార్యక్రమాన్ని అమలుచేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి. అదే రోజున వరంగల్ లో సినీవారం కూడా ప్రారంభించడానికి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

సినీవారం కార్యక్రమం మొదలుపెట్టిన తరువాత రాష్ట్రంలో అనేకమంది ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్స్ ముందుకు వచ్చి తమ సినిమాలను, తద్వారా తమ ప్రతిభను ప్రదర్శించుకొనే అవకాశం కలిగింది. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ సినీవారం కార్యక్రమానికి ఔత్సాహిక యువకులే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చి ప్రతిభగలవారిని గుర్తించి, ప్రోత్సహిస్తున్నారు. 



Related Post