పోలీసుల అత్యుత్సాహం...ప్రభుత్వానికే నష్టం

December 07, 2017


img

ఉస్మానియా యూనివర్సిటీ పిజి విద్యార్ధి మురళి ఆత్మహత్యకు నిరసనగా యూనివర్సిటీ విద్యార్ధులు ఆందోళన చేయగా వారిపై పోలీసులు విరుచుకుపడి లాఠీఛార్జి చేయడంతో అది విద్యార్ధులను మరింత  రెచ్చగొట్టినట్లయింది. ఆ కారణంగా గత మూడు నాలుగు రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రతిపక్ష పార్టీల పరామర్శలు వారి పుండు మీద కారం చల్లినట్లవుతోంది. కాంగ్రెస్, తెదేపా, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు బుధవారం యూనివర్సిటీ విద్యార్ధులను పరామర్శించారు.

సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగాలు భర్తీ చేయలేని తెరాస సర్కార్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై తన ప్రతాపం చూపిస్తోంది. అది ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పోలీసులు ఎంత అత్యుత్సాహం చూపిస్తే, దానికే అంత నష్టం. ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఇంకా వేగంగా పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న తెరాసకు 2019 ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం,” అని అన్నారు.

తెదేపా సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ, “ఉస్మానియా విద్యార్ధులను పరామర్శించడానికి మా పార్టీ నేత ఒంటేరు ప్రతా్‌పరెడ్డిని, ఇతర నేతలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం చాలా దారుణం.  ఉస్మానియా విద్యార్దులే బలిదానాలు చేసుకొని తెలంగాణా సాధించిపెట్టారనే సంగతి మరిచిన కెసిఆర్ వారిపైనే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. జైల్లో పెట్టిన విద్యార్దులందరినీ తక్షణం బేషరతుగా విడిచిపెట్టి, మురళి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు.

తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒక విద్యార్ధి చనిపోతే సహ విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేయడం సహజం. వారిపై పోలీసుల చేత లాఠీఛార్జి చేయించడం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం చాలా దారుణం. విద్యార్ధులకు నిరసన తెలిపే హక్కు కూడా ఉండదా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? జైల్లో పెట్టిన విద్యార్ధులు అందరినీ తక్షణం విడిచిపెట్టాలి,” అని డిమాండ్ చేశారు. 

తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఓయు నేతలు శివరాం, రాజేంద్ర ప్రసాద్, గణేష్, సురేష్ తదితరులు కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  


Related Post