ఇవంకా మా రోడ్డులో వెళితే బాగుండును: సునీత

November 24, 2017


img

హైదరాబాద్ వాసులు గత మూడున్నరేళ్ళుగా గోతులు పడిన రోడ్లపైనే పడుతూలేస్తూ ప్రయాణిస్తున్నారు. వారి మోరను ప్రభుత్వం ఆలకించలేదు. మంత్రి కేటిఆర్, జి.హెచ్.ఎం.సి. అధికారుల హామీలకు చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. నగరంలో రోడ్లు, నాలాలు అభివృద్ధి చేస్తున్నా అవి ఆశించిన స్థాయిలో జరుగడంలేదు కనుక ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. కనుక హైదరాబాద్ నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. కనుక అసంతృప్తిగానే ఉన్నారు. 

అయితే ఇవంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నందున, రాత్రికి రాత్రే నగరంలో ఆమె పర్యటించబోయే అన్ని ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. చక్కటి పరిశుభ్రమైన తారు రోడ్లు, రోడ్లకిరుపక్కలా అందమైన మొక్కలు, రోడ్ల పక్కన గోడలపై రంగురంగుల అందమైన చిత్రాలతో ఆ ప్రాంతాలన్నీ చాలా ఆహ్లాదకరంగా మారిపోయాయి. ఇసుకవేస్తే రాలనంతగా నిత్యం జనంతో, వ్యాపారులతో కిటకిటలాడే చార్మినార్ ప్రాంతంలో రాత్రికి రాత్రి ఒక అందమైన జంక్షన్ గా మారిపోతోంది. ఆర్టీసి బస్సుల హారన్లు, పొగలు స్థానంలో అందమైన ఫౌంటెన్లు, పచ్చటి పూల మొక్కలు వగైరాలు కనిపిస్తున్నాయి. ఇవాంకా మూడు రోజుల పర్యటన కోసం తెరాస సర్కార్ వందల కోట్లు ఖర్చు పెట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. “అయితే వాటన్నిటినీ ఇవాంకా తనతో అమెరికా పట్టుకుపోదు కదా? రోడ్ల మరమత్తులు, సుందరీకరణ చేస్తే హైదరాబాద్ వాసులకే అది ఉపయోగపడుతుంది కదా?” అని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు.

అయితే ఇవాంకా పర్యటన కోసం తెరాస సర్కార్ చేస్తున్న హడావుడిపై ప్రముఖులు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వారిలో ప్రాముఖ ప్లే-బ్యాక్ సింగర్ సునీత “ట్రంప్‌ కూతురు ఇవాంక రాయదుర్గం నుంచి ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బావుండు’” అని ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టారు. అంటే ప్రభుత్వం ఇవాంకా కోసం ఎంతయినా ఖర్చు చేసి రోడ్లు మరమత్తులు చేయిస్తుంది తప్ప ప్రజల కోసమైతే ఏమీ చేయడం లేదనే అసంతృప్తి కనిపిస్తోంది. కనుక తమ రోడ్లు బాగుపడాలంటే ఇవంకా ఆ మార్గంలో పర్యటించితే బావుండునని మెసేజ్ పెట్టారు.   

ఇక వివాదాల వర్మ, “ఇవంకాకు తాను అందగత్తెననే అహంకారం ఉంది. కానీ ఆమె కెసిఆర్ ను చూస్తే అయన అందాన్ని చూసి ఆమె షాక్ తినడం ఖాయం. కెసిఆర్, ఇవాంకా ఇద్దరూ పక్కపక్కన నిలబడితే అందరూ కెసిఆర్ నే చూస్తారు తప్ప ఆమెను చూడరు,” అని మెసేజ్ పెట్టారు. వర్మ కెసిఆర్ ను ఎందుకు పొగుడుతున్నాడో తెలియదు కానీ అతని పొగడ్తలు కెసిఆర్ ను ఎద్దేవా చేస్తున్నట్లున్నాయని అర్ధం అవుతూనే ఉంది. 



Related Post