మళ్ళీ యూపిలోనే రైలు ప్రమాదం

November 24, 2017


img

శుక్రవారం తెల్లవారుజామున 4.18 గంటలకు ఉత్తర ప్రదేశ్ లోని బందా అనే ప్రాంతంలో వాస్కోడీగామ-పాట్నా ఎక్స్ ప్రెస్ లోని 13 బోగీలు  పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. ఈ సంగతి తెలియగానే స్థానికులు, పోలీసులు, వైద్యసహాయ సిబ్బంది అందరూ అక్కడకు చేరుకొని బోగీలలో చిక్కుకొన్నవారిని బయటకు తీస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. 

ఈ ఏడాదిలో జరిగిన ఇటువంటి 6 రైలు ప్రమాదాలలో 5 ప్రమాదాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగడం ఆలోచింపజేస్తుంది. ఇదివరకు వరుసగా మూడు ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి నైతిక బాధ్యతవహిస్తూ రైల్వేమంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ రాజీనామాలు చేశారు. అయితే ఇటువంటి ప్రమాదాల నివారణకు అది పరిష్కారం కాదని ఆ తరువాత జరిగిన ప్రమాదాలు, మళ్ళీ ఈరోజు జరిగిన ప్రమాదం నిరూపించి చూపాయి. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను కొన్ని వేలకిలోమీటర్లు రైళ్ళు తిరుగుతుంటాయి. కానీ ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఎక్కడా వరుసగా ఇన్నిసార్లు రైళ్ళు పట్టాలు తప్పిన దాఖలాలు లేవు. కనుక ఆ రాష్ట్రంలోనే వరుసగా ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో రైల్వే అధికారులు దర్యాప్తు చేసి సమస్య మూలాలను కనుగొని వాటిని పరిష్కరించాలి తప్ప రాజీనామాలతో పరిష్కారమయ్యే సమస్య కాదిది. లేకుంటే ఇటువంటి ప్రమాదాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూనే ఉంటాయని గ్రహిస్తే మంచిది. 


Related Post