కొట్లాట సభకు ఇవాంకా ఎఫెక్ట్!

November 23, 2017


img

తెలంగాణా రాజకీయ జెఎసి అధ్వర్యంలో ఈనెల 30న సరూర్ నగర్ స్టేడియంలో జరుగవలసిన కొలువుల కొట్లాట బహిరంగ సభకు కూడా ఇవాంకా ట్రంప్ పర్యటన కారణంగా బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, తెలంగాణా జెఎసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరుగునుందని, దానికి అమెరికా అధ్యక్షుడు కూతురు ఇవంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, దేశవిదేశాల నుంచి వందల మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారని, కనుక నగరంలో ఇటువంటి సున్నితమైన పరిస్థితులున్నప్పుడు కొలువుల కొట్లాట వంటి ఆందోళన కార్యక్రమాలకు అనుమతీయలేమని పోలీసులు చెప్పారు. ఈ సమయంలో కొట్లాట సభకు భద్రత కల్పించడం కూడా కష్టమని కనుక డిసెంబర్ 6వ తేదీ తరువాత ఎప్పుడైనా మరో తేదీన కొట్లాట సభను జరుపుకోవడానికి అనుమతి కోరినట్లయితే పరిశీలిస్తామని పోలీస్ శాఖ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు.

ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత దీనిపై శుక్రవారం తన నిర్ణయం ప్రకటిస్తానని హైకోర్టు తెలిపింది. పోలీసులు చెపుతున్న కారణాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి కనుక హైకోర్టు కూడా సభను వాయిదా వేసుకోమనో లేక మరొక జిల్లాకో మార్చుకోమని సూచించవచ్చు. కనుక హైకోర్టు ఆవిధంగా చెప్పినట్లయితే టిజెఎసి ఏమి చేస్తుందో చూడాలి.  


Related Post