పార్లమెంటు సమావేశాలు షెడ్యూల్ ఖరారు

November 23, 2017


img

పార్లమెంటు శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో బుధవారం కేంద్రమంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 5వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబరు 25, 26, జనవరి 1 మూడు రోజులు శలవు దినాలను తీసేస్తే పార్లమెంటు మొత్తం 13 రోజులు పనిచేసినట్లవుతుంది.

సాధారణంగా నవంబర్ నెలలో జరుగవలసిన సమావేశాలను, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆలస్యం చేసిందని మోడీ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోడీ సర్కార్ కూడా తన నిర్ణయాన్ని సమర్ధించుకొంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్లమెంటు సమావేశాలను ఆలస్యంగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది. 

ఈసారి పార్లమెంటు సమావేశాలు మొదలైన తరువాత ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి కనుక వాటిని బట్టి అధికార, ప్రతిపక్షాలు జోరులో హెచ్చుతగ్గులు కనబడవచ్చు. వివాహిత ముస్లిం మహిళల జీవితాలకు భద్రత కల్పించే ‘ట్రిపుల్ తలాక్’ ను నిషేదిస్తూ బిల్లును ఈసారి సమావేశాలలో కేంద్రం ప్రవేశపెట్టబోతోంది కనుక దానిపై ఉభయసభలలో అధికార ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. 


Related Post