మన హైదరాబాద్ మన మెట్రో..

November 22, 2017


img

సరిగ్గా మరొక వారం రోజులలో మెట్రో రైల్ హైదరాబాద్ లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పరుగులు తీయబోతున్నాయి. స్వంత కార్లు, బైకులు, స్కూటర్లు ఉన్నప్పటికీ లేదా ఆటోలు, క్యాబ్స్ లో పయనిస్తున్నప్పటికీ ట్రాఫిక్ తో విసుగెత్తిపోయున్న హైదరాబాద్ నగరవాసులకు ఈ మెట్రో రైల్ చాలా ఉపశమనం కలిగించబోతోంది.  మియాపూర్ నుంచి నాగోల్ వరకు మద్యలో నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ళను కలుపుతూ ఈ మెట్రో సర్వీసు ఉంటుంది కనుక చాలా మంది ప్రజలు ఇకపై మెట్రో సర్వీసులనే ఆశ్రయించవచ్చు. ఆ కారణంగా రోడ్ ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది. అదే కారణంగా బస్సులు, క్యాబ్ లు, ఆటోవాలాలు కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది. 

ప్రతీ 10-12 నిమిషాలకు ఒక రైలు చొప్పున తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి 11గంటల వరకు మెట్రో సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఉదయం 5.30 గంటలకు అమీర్ పేట్ నుంచి ఒక రైలు నాగోల్ వైపు మరొకటి మియాపూర్ వైపుకు బయలుదేరుతాయి. అదేసమయంలో మియాపూర్ నుంచి ఒకటి, నాగోల్ నుంచి మరొకటి అమీర్ పేటకు బయలుదేరుతాయి. అప్పటి నుంచి అవి నాగోల్-మియాపూర్ మద్య రాత్రి 11 గంటల వరకు నిరంతరంగా నడుస్తూనే ఉంటాయి. 

పండుగలు, పరీక్షల సమయాలలో అధనపు సర్వీసులు నడిపించాలని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నిర్ణయించింది. మియాపూర్ నుంచి నాగోల్ మద్యగల 30 కిమీ దూరంలో మొత్తం 24 మెట్రో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంటే ఇంచుమించు ప్రతీ 1.5 కిమీకు ఒక స్టేషన్ ఉన్నట్లు లెక్క. కనుక నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, పర్యాటకులు మొదలైనవారికి మెట్రో రైల్ సర్వీసులు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనంగా మారబోతున్నాయి. ప్రతీ మెట్రో స్టేషన్ నుంచి సమీప ప్రాంతాలలో ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులు ఉన్నందున, ప్రజలు చాలా సులువుగా తమ గమ్యస్థానాలు చేరుకోగలరు. 


Related Post