మాటలు చెప్పి తప్పించుకొని పోయేటోడిని కాను!

November 21, 2017


img

మంత్రులు కేటిఆర్, నాయిని శ్రీనివాస్ రెడ్డి, తలసాని యాదవ్, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తదితరులు అందరూ కలిసి మంగళవారం హైదరాబాద్ చిక్కడపల్లి లోని కేంద్ర గ్రంధాలయ భవనం పరిశీలనకు వెళ్ళారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ అక్కడున్న యువత, మీడియా ప్రతినిధులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఒక్క ఉద్యోగం కూడా తక్కువ కాకుండా అన్నిటినీ భర్తీ చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మీకు ఉద్యోగాల కల్పించి, మీచేత శబాష్ అని మంచి పేరు సంపాదించుకోవాలని మాకు కూడా ఉంటుంది. అయితే ఉద్యోగాల భర్తీ అంటే వాటికీ అవసరమైన ఏర్పాట్లు, చట్టాలు, నియమనిబంధనలు వంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ కూడా ఉంటుంది. అందుకే ఉద్యోగాల భర్తీలో ఆలస్యం జరుగుతోంది తప్ప ఉద్యోగాలు ఇవ్వకూడదని కాదు.

ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత న్యాయవివాదాలలో చిక్కుకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అయినా సరే ఉద్యోగాల భర్తీ కోసం కోర్టుల చుట్టూ తిరుగక తప్పడం లేదు. ఇటీవల ఇచ్చిన డి.ఎస్.సి. నోటిఫికేషన్స్ కొత్త జిల్లాలు వారిగా ఇస్తే దానిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్ళారు. పాత జిల్లాల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తే ఆదిలాబాద్ లాంటి జిల్లాలలోని పిల్లలు నష్టపోతారనే ఉద్దేశ్యంతోనే కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు (యువత) నిరాశ చెందనవసరం లేదు. కాస్త ముందు వెనుకగా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అలాగే ఈ గ్రంధాలయం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అవసరమైతే ఇంకా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాము. నేను ఏవో మాటలు చెప్పి తప్పించుకొనేటోడిని కాను. మళ్ళీ మరోసారి అధికారులను వెంటబెట్టుకొని ఇక్కడికి వస్తాను. అప్పుడు మీరే వారిని అడుగవచ్చు. నేను కూడా మీతో బాటు అడుగుతాను,” అన్నారు మంత్రి కేటిఆర్.     



Related Post