చిన్నబాబు నోరు జారాడు..పోసాని నోట్లో పడ్డాడు!

November 21, 2017


img

ఏపి సర్కార్ ఇచ్చిన నంది అవార్డులను ‘తెదేపా అవార్డులు’గా మార్చేసిందని వచ్చిన విమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త హుందాగా, పద్దతిగానే స్పందించారు. వాటికి కూడా పార్టీ, కులం రంగు పూయడం సరికాదని, ఇక నుంచి ప్రజాభిప్రాయం సేకరించి ఆ ప్రకారమే అవార్డులు ప్రకటిస్తామని అన్నారు. కానీ చిన్నబాబు మాత్రం విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ‘ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ తెలంగాణా సర్కార్ కు పన్నులు చెల్లిస్తున్నవారు ఏపి సర్కార్ ఇచ్చిన నంది అవార్డులను విమర్శించడం ఏమిటని, అలాగయితే  నంది అవార్డులు ఎత్తేస్తామని’ నోరుజారి నటుడు పోసాని కృష్ణ మురళికి చిక్కాడు.

లోకేష్ వ్యాఖ్యలపై పోసాని స్పందిస్తూ, “మీకు కూడా హైదరాబాద్..తెలంగాణాలో ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయి కదా? మీరు కూడా ఇక్కడ పన్నులు చెల్లిస్తూనే ఉన్నారు కదా?అయినా మీరు ఏపిలో మంత్రులు కావడం లేదా..అధికారం చలాయించడం లేదా? మరి మేము కూడా ఇక్కడ (తెలంగాణాలో) పన్నులు చెల్లిస్తూ మేము నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడితే మీకు ఉలుకెందుకు? తెలంగాణా ప్రభుత్వానికి పన్నులు కట్టినవారు ఆంధ్రా ప్రభుత్వం ఇచ్చిన అవార్డులలో అవకతవకలుంటే ప్రశ్నించకూడదా?నారా లోకేష్...నీవంటి మనస్తత్వం తెలంగాణా ప్రజలకు ఉన్నట్లయితే, ఈపాటికి వాళ్ళు మమ్మల్ని పిచ్చి కుక్కలను కొట్టినట్లు కొట్టి తరిమేసేవారు. అప్పుడు మేము తెలుగు రోహ్యింగాలుగా మారిపోయుండేవాళ్ళమేమో? నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను ఎవరైనా తప్పు పడితే అవార్డులు ఇవ్వడం నిలిపివేస్తామని అంటున్నావు. అవేమైనా నీ స్వంత వ్యవహారమని అనుకొంటున్నావా?పద్మా అవార్డుల మొదలుకొని అత్యున్నతమైన భారతరత్న అవార్డు వరకు అన్ని రకాల అవార్డుల ఎంపిక ప్రక్రియలో ఇటువంటి లోపాలున్నప్పుడు అందరూ వేలెత్తి చూపిస్తూనే ఉన్నారు. అంతమాత్రన్న ఆ అవార్డులు ఎత్తివేయలేదే? మరి నువ్వు ఏ అధికారంతో వాటిని ఎత్తివేస్తామని అన్నావు?” అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. 

చిన్నబాబు నోరుజారి పోసాని నోట్లో పడితే, యువరాజు వంటి చిన్నబాబుపై పోసాని ఇంతగా రెచ్చిపోయి ఏపిలో స్వయంగా తలుపులు మూసుకొన్నారని చెప్పవచ్చు. ఏమైనప్పటికీ ఈ నంది అవార్డులతో ఏపి సర్కార్ బద్నాం కాగా, ఈ వివాదాల కారణంగా ఆ అవార్డులకు ఎంపికయినవారికి ఆ సంతోషం లేకుండా పోయింది. వాటి గురించి గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. నంది అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి, వాటికి ఎంపికయిన వారికీ కూడా ఇది అప్రదిష్టగా మారడం విచిత్రమే.


Related Post