సౌభాగ్య పధకం ప్రారంభించిన మోడీ

September 25, 2017


img

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత దేశవ్యాప్తంగా నేటికీ విద్యుత్ కు నోచుకొని మారుమూల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని వేల గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి విద్యుత్ కూడా అందిస్తోంది.  ప్రతీ ఇంటికీ విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతో “ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన” (సౌభాగ్య) అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. 2018 డిశంబర్ నాటికల్లా దేశంలో అన్ని గ్రామాలలో, పట్టణాలలో గల నిరుపేదల ఇళ్ళకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.

ఈ పధకంలో భాగంగా ప్రతీ ఇంటికి ఒక బ్యాటరీ, ఒక సోలార్ ఫ్యాన్, ఐదు ఎల్.ఈ.డి.బల్బులు ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తుంది.

దీని కోసం కేంద్రప్రభుత్వం పట్టణ ప్రాంతాలకు రూ.2,295 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు రూ.14,025 కోట్లు కేటాయించింది. ఈ పధకంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు 60:10 నిష్పత్తిలో భరిస్తాయి. మిగిలిన 30 శాతాన్ని రుణాల ద్వారా సేకరించుకోవలసి ఉంటుంది. ప్రత్యేక హోదా కలిగిన జమ్మూ కాశ్మీర్,  ఈశాన్య రాష్ట్రాలలో ప్రభుత్వాలు కేవలం 5శాతం తమ వాటాగా చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రప్రభుత్వం 85శాతం భరిస్తుంది. మిగిలిన 10 శాతాన్ని రుణాల ద్వారా సేకరించుకోవలసి ఉంటుంది.  

ఈ విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు ఒక్కో ఇంటికి కేవలం రూ.500 చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఒకేసారి చెల్లించనవసరం లేదు. ప్రతీ నెల విద్యుత్ బిల్లులో రూ.10 చొప్పున వసూలు చేయబడుతుంది. అంటే దాదాపు ఉచితంగా విద్యుత్ కనెక్షన్స్ ఇస్తున్నట్లే భావించవచ్చు. 2011 సర్వేలో గుర్తించబడిన పేదకుటుంబాలు ఈ విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు అన్నీ అర్హమైనవే. 


Related Post