కవితక్క సూటి ప్రశ్నకు సమాధానం ఏమిటో?

September 25, 2017


img

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు అక్టోబర్ 5న జరుగబోతున్నాయి కనుక అధికార తెరాసకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘం (టి.జి.బి.టి.కె.ఎస్.) తరపున దాని గౌరవ అధ్యక్షురాలు తెరాస ఎంపి కవిత ఆదివారం ప్రగతి భవన్ లో సంఘం నేతలతో సమావేశం నిర్వహించారు. సింగరేణిలో బలమైన సంఘాలుగా గుర్తింపు పొందిన హెచ్.ఎం.ఎస్., టి.ఎన్.టి.యు.సి. మరియు సి.ఐ.టి.యు. సంఘాలకు చెందిన పలువురు కార్మిక నేతలు నిన్న తెలంగాణా బొగ్గుగని కార్మిక సంఘంలో చేరారు. వారందరికీ కవిత తెరాస కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. 

అనంతరం ఆమె వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వారసత్వ ఉద్యోగాల గురించి చాలా రాద్దాంతం చేస్తున్న ఏ.ఐ.టి.యు.సి. నేతలను నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. కేంద్రంలో కానీ రాష్ట్రంలోగానీ మీ పార్టీ అధికారంలో లేనప్పుడు, మీరు ఏవిధంగా వారసత్వ ఉద్యోగాలు సాధిస్తారో సంతృప్తికరమైన సమాధానం చెపితే మేమే మీకు మద్దతు ఇచ్చి మీ సంఘానికే ఓట్లు వేయమని కార్మికులను కోరుతాము. ఎన్నికలలో విజయం సాధించడం కోసమే మీరు వారసత్వ ఉద్యోగాల పేరిట కార్మికులను రెచ్చగొడుతున్నారు తప్ప నిజంగా మీరు వాటిని సాధించగలరా? వారసత్వ ఉద్యోగాల కోసం ప్రభుత్వం జీవో జారీ చేస్తే ప్రతిపక్షాలే దానిని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేయించి అడ్డుకొన్న సంగతి అందరికీ తెలుసు. మళ్ళీ వారే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

మా ప్రభుత్వం సింగరేణి కార్మికులు సమస్యలను అర్ధం చేసుకొని వారు నోరు తెరిచి అడుగక మునుపే వారి కోర్కెలన్నిటినీ నెరవేరుస్తోంది. ఈ మూడేళ్ళలో సింగరేణిలో 5,600 ఉద్యోగాలు ఇచ్చింది. వి.ఆర్.ఎస్. తీసుకొన్న మరో 3,100 మందికి ఉద్యోగాలు కల్పించింది. సింగరేణి కార్మికులు అందరూ జి.బి.టి.కె.ఎస్.కే ఓటు వేసి గెలిపించితే ఇంకా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం కూడా గట్టిగా కృషి చేద్దాము,” అని కవిత అన్నారు.  


Related Post