కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రమాదం: ఏడుగురు మృతి

September 21, 2017


img

కాళేశ్వరం ప్రాజెక్టు 10వ ప్యాకేజి పనులలో బుదవారం మధ్యాహ్నం ఘోరప్రమాదం జరిగింది. మద్యమానేరు నుంచి  మల్లన్నసాగర్ కు నీటిని తరలించేందుకు సిరిసిల్లా జిల్లాలో ఇల్లంతకుంట మండలలో తిప్పాపూర్ వద్ద 7.6 కిమీ పొడవైన సొరంగ మార్గం త్రవ్వకం పనులు సాగుతున్నాయి. 

యధాప్రకారం కార్మికులు నిన్న మధ్యాహ్నం ఎయిర్ బ్లాస్టింగ్ పద్దతిలో సొరంగంలో బండరాళ్ళను పేల్చుతుండగా పైకప్పు కూలి ఆరుగురు కార్మికులు అక్కడిక్కడే చనిపోయారు. మరి కొందరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఆసుపత్రిలో చేర్చినవారిలో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉంది. 

సొరంగ మార్గంలో పనిచేస్తున్న కార్మికులు అందరూ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారే. మృతులలో జితేందర్ కుమార్‌ (పశ్చిమ బెంగాల్‌), రామకృష్ణ సాహు (ఒరిస్సా), బందన్ సరేన్ (జార్ఖండ్‌), హికిమ్ హన్సిదా (జార్ఖండ్‌), హరిచంద నేతన్ (ఛత్తీస్‌గఢ్‌), కురన్ సింగ్ (జార్ఖండ్‌), సందీప్‌ (ములుగు, వరంగల్‌ జిల్లా) ఉన్నారు. తీవ్ర గాయాలైనవారిలో జత్నాహోత్నా (జార్ఖండ్‌) పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకొని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌, ఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి, అధికారులు, పోలీసులు,  అగ్నిమాపక సిబ్బంది, సహాయ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని స్వయంగా సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బాధితులను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ సొరంగ మార్గం దాదాపు పూర్తి కావచ్చింది. మరొక 800 మీటర్లు త్రవ్వకం పని మాత్రమే మిగిలి ఉంది. దానినీ వీలైంత త్వరగా పూర్తిచేయాలని ప్రయత్నిస్తుండగా ఊహించని విధంగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఈ ప్రాజెక్టు ఈఈ ఆనంద్ ప్రకటించారు.   

ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యం కారణమా లేక మానవ తప్పిదమా అనేది దర్యాప్తులో తెలియవలసి ఉంది. ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న కాంగ్రెస్, సీపీఐ (ఎం) నేతలు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి, చనిపోయినవారి కుటుంబాలకు, గాయపడిన వారికి సముచిత నష్టపరిహారం చెల్లించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై, కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


Related Post