ఇద్దరినీ ఒకే తుపాకీతో హత్య?

September 13, 2017


img

సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత్రి గౌరీ లంకేష్ హత్య కేసులో ఫోరెన్సిక్ విభాగం ఒక ఆసక్తికరమైన విషయం బయటపెట్టింది. ఉత్తర కర్ణాటకలో ధార్వాడ్ లో నివసిస్తున్న ప్రముఖ రచయిత, హేతువాది డాక్టర్ ఎంఎం కల్బుర్గీ కూడా రెండేళ్ళ క్రితం ఆగస్ట్ నెలలో ఇదేవిధంగా ఇంటి ముందే హత్య చేయబడ్డారు. ఆరోజు ఆయనను హత్య చేయడానికి దుండగులు వినియోగించిన 7.65 ఎంఎం దేశవాళి తుపాకీతోనే గౌరీ లంకేష్ కూడా హత్యచేయబడ్డారని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. రెండు హత్యలు జరిగిన తీరు కూడా ఒకే విధంగా ఉందని కనుక ఇద్దరినీ హత్య చేసినవారు ఒకరే అయ్యుండవచ్చని నివేదికలో పేర్కొంది. 

సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్ హత్య చేయబడ్డారు. కర్నాటక ప్రభుత్వం వెంటనే ఐజిపి ఇంటలిజెన్స్ అధికారి బికె సింగ్ నేతృత్వంలో 19 మందితో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వారు గౌరీ లంకేష్ ను హత్య చేసినవారిని పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. కనీసం ఈసారైనా వారిని పట్టుకోగలిగితే రెండు హత్యల కేసులు ఒకేసారి పరిష్కారం అవుతాయి. 


Related Post