ఇక కోరిన వెంటనే విడాకులు?

September 13, 2017


img

విడాకులు తీసుకోవాలనుకొంటున్న దంపతులు ఇక నుంచి దాని కోసం 6 నెలలు వేచి చూడనక్కరలేదు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్న దంపతులు ఇక కలిసి జీవించే పరిస్థితిలో లేరని న్యాయస్థానాలు భావిస్తే వారికి తక్షణమే విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హిందూ వివాహ చట్టం(1955) లో సెక్షన్ 13బీ (2) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్న దంపతులు 6 నెలలు వేచి చూడవలసి వచ్చేది. ఆలోగా వారిరువురి మద్య మళ్ళీ సయోధ్య ఏర్పడి కలిసి జీవించే అవకాశం కల్పించడం కోసమే చట్టంలో ఆ నిబంధన ఏర్పాటు చేశారు రాజ్యంగ నిర్మాతలు. అయితే అది కేవలం ఒక సదుద్దేశ్యంతో ఏర్పటు చేసిన సలహా వంటిదే తప్ప విధిగా ఆ నియమాన్ని పాటించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసింది. 

కనుక పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్న దంపతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అవసరమనుకొంటే వారికి తక్షణమే విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఒకవేళ ఆ పిటిషనర్స్ (దంపతులలో)లో ఎవరైనా ఈ కేసు విచారణకు హాజరుకాలేని పక్షంలో వారి తరపున వారి కుటుంబసభ్యులు ఎవరైనా హాజరవవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది. అవసరమైతే పిటిషనర్స్ లేదా వారికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న కుటుంబ సభ్యులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా విచారణలో పాల్గొనవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా వివరణతో దేశవ్యాప్తంగా దాఖలైన వేలాది విడాకుల కేసులు తక్షణమే పరిష్కరింపబడే అవకాశం ఏర్పడుతుంది. 

ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలలు నిషేధం విధించిన సుప్రీంకోర్టు, భార్యభార్తలు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నట్లయితే వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని చెప్పడం విశేషమే.


Related Post