కొత్త రాష్ట్రపతికి అప్పుడే పరీక్ష!

July 25, 2017


img

ఈరోజు భారతదేశ 14 వ రాష్ట్రపతిగా భాద్యతలు స్వీకరించిన రాంనాథ్ కోవింద్ కు మొదటి రోజునే చిన్న పరీక్ష ఎదుర్కోవలసివచ్చింది. ఆయన ప్రమాణస్వీకారం చేసిన కొద్దిసేపటికే ఒక క్షమాభిక్ష పిటిషన్ వచ్చింది. అది కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిస్ కర్ణన్ ది. 

సుప్రీంకోర్టు ధిక్కారణ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కోల్ కతా సెంట్రల్ జైల్లో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవిస్తున్న జస్టిస్ సిస్ కర్ణన్ తనకు క్షమాభిక్ష పెట్టి జైలు శిక్ష రద్దు చేయాలని లేకుంటే శిక్షా కాలాన్ని తగ్గించాలని ఒక పిటిషన్ ద్వారా కొత్త రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను అభ్యర్ధించారు. 

జస్టిస్ సిస్ కర్ణన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారికే జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ తీర్పులు చెప్పడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం చెంది ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆయనను పోలీసులు జూన్ 20వ తేదీన అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠీకి, మళ్ళీ సుప్రీంకోర్టుకి కూడా ఆయన అప్పీలు చేసుకొన్నారు. కానీ ఎవరూ కనికరించలేదు. కొత్తగా రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన రాంనాథ్ కోవింద్ కూడా కేంద్రప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు సలహా మేరకే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది కనుక కర్ణన్ కు క్షమాభిక్ష ప్రసాదించక పోవచ్చు. ప్రసాదిస్తే కర్ణన్ అదృష్టవంతుడే! 


Related Post